Friday, March 29, 2024

విజ‌య‌వాడ‌లో జ‌న‌సేన‌, బిజెపి సీట్ల పంప‌కం పూర్తి – ఇక ప్ర‌చారంపై దృష్టి..

విజయవాడ: రాజ‌కీయ కూట‌మిగా ఏర్ప‌డిన బిజెపి, జ‌న‌సేన‌లో విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క‌సంస్థ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డిగా పోటీ చేస్తున్నాయి.. ఈ మేర‌కు ఇరు పార్టీల మ‌ధ్య సీట్ల పంపిణీ పూర్తి చేశారు.. మొత్తం 64 డివిజ‌న్ల‌కు గాను జ‌న‌సేన 38 చోట్ల‌, బిజెపి 26 డివిజ‌న్ ల‌లో బ‌రిలోకి దిగుతున్నాయి.. జ‌న‌సేన నుంచి పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను ఆ పార్టీ రాజ‌కీయ‌ కార్య‌ద‌ర్శి హ‌రిప్ర‌సాద్ విడుద‌ల చేశారు.. ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ జ‌న‌సేన ఎన్నిక‌ల స‌మ‌న్వ‌య క‌మిటీ పోటీ చేయ‌నున్న అభ్య‌ర్ధుల‌తో నేడు స‌మావేశం నిర్వ‌హించింది.
నగరపాలక సంస్థలో జనసేన కార్పొరేటర్ అభ్యర్థుల జాబితాను నేతలు విడుదల చేశారు. జనసేన, బీజేపీ పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగనున్నారు. జనసేన నుంచి 38 మంది అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ స‌మావేశంలో పోతిన వెంకట మహేష్ , కమిటీ సభ్యులు చిల్లపల్లి శ్రీనివాస్ , అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) , బూరగడ్డ శ్రీకాంత్ తో పాటు పోటీ చేయ‌నున్న స‌భ్యులు పాల్గొన్నారు.. ఈ సంద‌ర్భంగా పోతిన వెంక‌ట మ‌హేష్ మాట్లాడుతూ, న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల‌లో యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి అధిష్టానం సీట్లు కేటాయించిందని తెలిపారు. టీడీపీ, వైసీపీకి ధీటుగా జనసేన అభ్యర్థులు పోటీ పడుతున్నారన్నారు. కరోనా సమయంలో ఆ రెండు పార్టీలు ఎక్కడా కనిపించ లేదని చెప్పారు. జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ప్రజలకు ఎన్నో సేవలు అందించారని గుర్తుచేశారు. సొంత వనరులతో ఎంతోమందికి కడుపు నింపారన్నారు. టీడీపీలో ఒకరికొకరు కొట్టుకోవడంతోనే సరి పోతుందని యెద్దేవా చేశారు. టీడీపీ, వైసీపీలకు ఓటేస్తే కుటుంబ పాలనకు మద్దతు ఇచ్చినట్లే అని అన్నారు. చెల్లబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ…పవన్ కళ్యాణ్, మనోహర్‌ల ఆమోదంతో అభ్యర్థులను నిలబెట్టామని తెలిపారు. పొత్తులో భాగంగా జనసేన 38, బీజేపీ 26 చోట్ల పోటీ పడుతున్నారని చెప్పారు. ప్రజల నుంచి మంచి ఆదరణ తమకు ఉందన్నారు. మెజారిటీ స్థానాలను కైవసం‌ చేసుకుంటామని భావిస్తున్నామన్నారు. పొత్తులో భాగంగా కొన్ని సీట్లు బీజేపీకి కేటాయించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. జన సైనికులు అర్థం చేసుకుని పార్టీ విజయానికి పని చేయాలని కోరారు.
అక్కల గాంధీ మాట్లాడుతూ…బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా 64 డివిజన్లలో రెండు పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. 38చోట్ల జనసేన అభ్యర్థులతో పాటు, బీజేపీ అభ్యర్థుల గెలుపుకి అందరూ కృషి చేయాలని కోరారు. పోటీగా నామినేషన్లు వేసిన వారు విత్ డ్రా చేసుకోవాలని కోరుతున్నామన్నారు. పార్టీ లైన్‌ను అందరూ గౌరవించి..‌ ఆచరించాలని కోరారు. విజయవాడ కార్పొరేషన్‌ను కైవసం‌ చేసుకుంటామనే నమ్మకం తమకుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement