Friday, April 19, 2024

Spl Story | కన్నడసీమపై కమలనాథుల గురి.. మళ్లీ అధికారమే లక్ష్యంగా పావులు

మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న కర్నాటకలో మరోసారి గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. నిజానికి గత ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత మెజారిటీ లభించనప్పటికీ ‘ఆపరేషన్ లోటస్’ అమలు చేసి, ఫిరాయింపుదార్ల మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కానీ ఈసారి అసెంబ్లీలో పూర్తి మెజారిటీ సాధించడమే కాదు, ఆ తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ సీట్లు ఎక్కువ సంఖ్యలో కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కర్నాటకలో బీజేపీ వ్యూహాలు, ప్రణాళికలపై ‘ఆంధ్ర‌ప్ర‌భ ఫోక‌స్‌’..

– స్వరూప పొట్లపల్లి, ఆంధ్రప్రభ ఢిల్లీ బ్యూరోచీఫ్

దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి గేట్‌వేగా భావించే కర్నాటకలో బీజేపీ అగ్రనేతలు తమ కార్యకలాపాలను పెంచారు. డిసెంబర్ 30-31 తేదీల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించారు. మాండ్యలో పార్టీ క్షేత్రస్థాయి నేతలతో సమావేశం నిర్వహించారు. జనవరిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అమిత్ షా మరోసారి రాష్ట్రంలో పర్యటించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. జనవరి 5, 6 తేదీల్లో రెండ్రోజుల పాటు కర్నాటకలో పర్యటించేలా జేపీ నడ్డా కార్యక్రమాలు సిద్ధం చేసుకున్నారు.

బహిరంగ సభలో ప్రసంగంతో పాటు కర్ణాటక కార్యకర్తలతో సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కర్ణాటకలోని హుబ్లీలో 7,500 మంది యువకులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. జనవరి 28న హోంమంత్రి అమిత్ షా మరోసారి కర్ణాటకలోని హుబ్లీలో పర్యటించనున్నారు. అక్కడ పార్టీ కార్యకర్తలతో సమావేశమై పార్టీ వ్యూహాలపై చర్చించనున్నారు.

- Advertisement -

వొక్కలిగలపై ఆకర్ష్ మంత్రం..
రాజకీయ పార్టీలు సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసుకుంటూ ఓటుబ్యాంకు తయారు చేసుకోవడం కొత్తేమీ కాదు. కర్నాటకలో సంఖ్యాపరంగా, సమాజంపై ప్రభావం చూపగలిగే వర్గాల్లో లింగాయత్‌ల తర్వాత వొక్కలిగలు ఉన్నారు. అయితే వొక్కలిగ సామాజికవర్గం ప్రజలు గత కొన్ని దశాబ్దాలుగా జనతాదళ్ (సెక్యులర్) పార్టీకి సాంప్రదాయ ఓటుబ్యాంకుగా కొనసాగుతున్నారు. తమ వర్గానికి చెందిన హెచ్‌డీ దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి చేతిలోనే పార్టీ ఉండడంతో జేడీ(ఎస్)ను తమ సొంత పార్టీగా భావిస్తుండడమే ఇందుకు కారణం. బలమైన జేడీ(ఎస్) ఓటుబ్యాంకుపై ఇప్పుడు బీజేపీ దృష్టి పెట్టింది.

మైసూరు పరిసర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఉండే వొక్కలిగ ఓటుబ్యాంకు చీల్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. మాండ్యలో జరిగిన సమావేశంలో పార్టీ నేతలతో అమిత్ షా ఇదే విషయంపై దిశానిర్దేశం చేశారు. పూర్తి శక్తితో ఎన్నికల్లో పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడతో సమావేశమవడంతో పార్టీ శ్రేణుల్లో తప్పుడు సంకేతాలు వెళ్లాయి. జేడీ(ఎస్)తో పొత్తు ఉంటుందని, లేదంటే లోపాయకారి ఒప్పందం ఉంటుందని కార్యకర్తలు భావించారు. ఈ ఫీడ్‌బ్యాక్ అమిత్ షా వరకు చేరింది. అందుకే ఆయన పార్టీ శ్రేణులకు పూర్తి స్పష్టతనిస్తూ ప్రసంగించారు. జేడీ(ఎస్)తో రాజీ పడే ప్రసక్తే లేదని, వారి కంచుకోటలో పూర్తి బలంతో, వ్యూహాత్మక సామాజిక సమీకరణాలతో బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు కసరత్తు మొదలుపెట్టారు.

ఓల్డ్ మైసూరు ప్రాంతమే కీలకం
కర్ణాటకలో సంఖ్యాపరంగా రెండో అతి పెద్ద సామాజికవర్గమైన వొక్కలిగలపై బీజేపీకి పెద్దగా పట్టు లేదు. రాష్ట్ర ఓటర్లలో దాదాపు 15% వరకు వొక్కలిగ వర్గానికి చెందినవారు ఉన్నారు. పైగా కర్నాటకలో రాష్ట్రమంతటా విస్తరించినట్టుగా కాకుండా దక్షిణ ప్రాంతంలోనే ఎక్కువ సంఖ్యలో పోగై ఉన్నారు. దాంతో వొక్కలిగలు రాష్ట్ర అసెంబ్లీలోని 60 సీట్లను ప్రభావితం చేయగల్గుతున్నారు. పాత మైసూర్ ప్రాంతం కర్ణాటకలోని వోకలింగ సమాజానికి కంచుకోటగా పేరొందింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పాత మైసూర్ ప్రాంతంలో 35 సీట్లు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.

30 జిల్లాల కర్నాటకలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓల్డ్ మైసూర్ ప్రాంతంలోని 5 జిల్లాల్లో బీజేపీ ఖాతా కూడా తెరవలేకపోయింది. వొక్కలిగ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో జేడీ(ఎస్‌) తన ఆధిక్యతను చాటుకుంది. జేడీ(ఎస్) తర్వాతిస్థానంలో కాంగ్రెస్ నిలిచింది. వొక్కలిగ సామాజికవర్గంలో కొంత భాగంతో పాటు ఈ ప్రాంతంలోని ఇతర సామాజికవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టుంది. ఈ పరిస్థితుల్లో ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో మెరుగైన పనితీరు ప్రదర్శించకుండా అధికారాన్ని చేజిక్కించుకోవడం కష్టమని బీజేపీ భావిస్తోంది. అందుకే వొక్కలిగ సామాజికవర్గంలో బీజేపీ తన స్ట్రైక్ రేట్ మెరుగుపర్చుకునేలా పథక రచన చేస్తోంది.

లింగాయత్ కమ్యూనిటీలో బీజేపీకి ఎప్పుడూ మంచి పట్టుంది. కుర్బా, బ్రాహ్మణ వర్గాలతో పాటు ఇతర కులాల్లోనూ పార్టీ పట్టు బాగానే ఉంది. బలమైన వొక్కలిగలను ఆకట్టుకోగల్గితే తమకు తిరుగే ఉండదని కమలనాథులు భావిస్తున్నారు. ఈ క్రమంలో జేడీ(ఎస్‌)కు చెందిన కొందరు బలమైన వొక్కలిగ సామాజికవర్గ నేతలను ఎన్నికల ముందు బీజేపీలో చేర్చుకోడానికి ఆపరేషన్ చేపట్టారు. కర్నాటకలోని ప్రస్తుత ప్రభుత్వంలో అశ్వత్ నారాయణ్, ఆర్ అశోక వంటి బలమైన నాయకులు సహా వొక్కలిగ వర్గం నుంచి మొత్తం ఏడుగురు మంత్రులున్నారు.

కేంద్ర మంత్రివర్గంతో పాటు, పార్టీ జాతీయ కార్యవర్గంలో మంచి స్థానం కల్పించారు. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే, జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి కూడా వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వారే. త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణలో ఈ వర్గానికి చెందిన నేతలకు మరింత ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది.

అందరినీ కలుపుకుపోవాలి..
రాష్ట్రంలోని లింగాయత్ సామాజికవర్గంలోని పంచమసాలీ ఉపకులాలను, వొక్కలి సామాజికవర్గానికి చెందిన కొన్ని ఉపకులాలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా తమవైపు తిప్పుకోవాలని బీజేపీ వ్యూహరచన చేసింది. కుల మరియు ప్రాంతీయ ఆకాంక్షలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం పొందుతున్న తరగతులను సరళీకృతం చేయడానికి, రాష్ట్రంలో సూక్ష్మ స్థాయిలో బీజేపీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేసింది.

ఈ ప్రచారాన్ని విజయవంతం చేసేందుకు మరికొందరు పార్టీ కేంద్ర నేతలు త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నారు. అలాగే ఇంతకాలం అధికారానికి, పదవులకు నోచుకోని ఇతర చిన్న కులాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కర్ణాటకలోని పార్టీ నేతలు, కార్యకర్తలకు కమలదళపతులు సూచించారు. ఎన్నికల దృక్కోణంలో ప్రతి ఒక్క ఓటు ముఖ్యమని, కాబట్టి తక్కువ సంఖ్యా బలం ఉన్న కులాలను కూడా కలుపుకునిపోవాలని హోంమంత్రి అమిత్ షా ఇటీవల తన సమావేశంలో పార్టీ నేతలతో చెప్పినట్టు తెలిసింది.

కొత్త తరానికి చోటు
నేతల మధ్య పరస్పరం కుమ్ములాటలు, వర్గపోరును కట్టడి చేయడంపైనా అధిష్టానం దృష్టిపెట్టింది. నిరంతరాయంగా చేస్తున్న ప్రయత్నాలతో ఈ విబేధాలు, గొడవలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. కర్నాటక బీజేపీకి పెద్దదిక్కుగా చెప్పుకునే మాజీ సీఎం బీఎస్‌ యడ్యూరప్ప పార్టీకి మార్గదర్శిగా వ్యవహరిస్తారని, ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మై పార్టీ నాయకుడిగా ఉంటారని బీజేపీ చెబుతోంది. త్వరలో బీజేపీ రాష్ట్ర ప్రచార కమిటీని ఏర్పాటు చేసి అందులో పార్టీకి చెందిన ప్రముఖ నేతలకు చోటు కల్పిస్తుందని తెలుస్తోంది. అలాగే ప్రభుత్వంపై సహజంగా ఏర్పడే వ్యతిరేకతను ఎదుర్కోడానికి రాష్ట్రంలోని సీనియర్ నేతలకు కాకుండా యువ నేతలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది.

రాష్ట్రంలో 25% కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తారని, కనీసం రెండు డజన్ల మంది పెద్ద నేతలను ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండేలా ఇప్పటికే ఒప్పించారని కూడా తెలుస్తోంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ద్వారా లబ్దిపొందే ప్రతి ఇంటికీ బీజేపీ చేరుకుని ప్రచారం చేయాలని అధిష్టానం సూచించింది. ఆ మేరకు లబ్దిదారులు చేరుకుని, వారి తదుపరి ఆకాంక్షలను అర్థం చేసుకోడానికి క్షేత్రస్థాయిలో రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఇటీవల రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర ప్రభావాన్ని సైతం కమలనాథులు అంచనా వేశారు. కర్ణాటకలో ఈ యాత్ర పెద్దగా ప్రభావం చూపలేదని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత కర్ణాటకలోని చామరాజనగర్‌, బీజాపూర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని, రెండు చోట్లా కాంగ్రెస్‌ ఓడిపోయిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement