Friday, April 19, 2024

జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్‌పై బీజేపీ ఫోకస్‌.. 14 ఎంపీ సీట్లు టార్గెట్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్‌ పెంచింది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 14 ఎంపీ సీట్లను (నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, సికింద్రాబాద్‌, కరీంనగర్‌ సిట్టింగ్‌ స్థానాలతో సహా) గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు పార్లమెంటరీ నియోజకవర్గాలే లక్ష్యంగా పలు కార్యక్రమాలను చేపడుతోంది. పార్లమెంటరీ ప్రవాస్‌ యోజన పేరుతో పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు రాష్ట్రంలో వరుస పర్యటనలు కొనసాగిస్తున్నారు.

రాష్ట్ర పర్యటన సందర్భంగా కేంద్రం అమలు చేస్తున్న పథకాలతోపాటు రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను, కాంగ్రెస్‌ పార్టీ విధానాలను కేంద్ర మంత్రులు ఎండగడుతుండడంతో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. కొద్ది నెలల క్రితం పార్లమెంటరీ ప్రవాస్‌ యోజనలో భాగంగానే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ జహీరాబాద్‌లో పర్యటించారు. ఆ సమయంలో నిర్మల బీర్కూరులో జిల్లా కలెక్టర్‌ను రేషన్‌ బియ్యంపై నిలదీయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

మూడు రోజులుగా పలువురి కేంద్ర మంత్రుల పర్యటనలు పార్లమెంటరీ ప్రవాస్‌ యోజన కింద రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే ఇద్దరు కేంద్రమంత్రులు తమ పర్యటనలు పూర్తి చేసుకుని వెళ్లారు. జీ20 అనుబంధ సదస్సులో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయ పాల్గొని వెళ్లగా.. పార్లమెంటరీ ప్రవాస్‌ యోజన కింద వరంగల్‌ ఎంపీ నియోజకవర్గం పరిధిలో కేంద్ర మంత్రి బీఎల్‌ వర్మ పర్యటించారు. సోమవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానం పరిధిలో పర్యటించారు.

- Advertisement -

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన పలు విమర్శనాస్త్రాలు సంధించారు. అవినీతి, కుటుంబ పాలన అంటూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మరోవైపు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు భారతీ బెహన్‌జీ సోమవారం హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలో, మంగళవారం భువనగిరి ఎంపీ సెగ్మెంట్‌లో పర్యటిస్తారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ మంగళవారం సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానంలో పర్యటించనున్నారు. పార్లమెంటరీ ప్రవాస్‌ యోజనలో భాగంగా రాష్ట్రంలో తరచూ పర్యటించి ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రత్యక్షంగా వివరించాలని బీజేపీ జాతీయ నాయకత్వం కేంద్ర మంత్రులు, జాతీయ నేతలను ఆదేశించింది.

విభిన్న పథకాల ద్వారా వివిధ వర్గాల పేదలకు కేంద్రం నుంచి అందుతున్న సహాయం, ఆయా సంక్షేమ, అభివృద్ధి పథకాలకు కేంద్ర వాటాగా అందజేస్తున్న నిధులు కేంద్ర మంత్రుల ద్వారా వివరిస్తే దాని ప్రభావం ప్రజల్లో ఎక్కువగా ఉంటుందనే భావనతో బీజేపీ ఈ వ్యూహాన్ని ఎంచుకుంది. పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు అదే సమయంలో పార్టీని తెలంగాణలో సంస్థాగతంగా బలోపేతం చేయడంపై పార్లమెంటరీ ప్రవాస్‌ యోజన ద్వారా బీజేపీ దృష్టి సారించింది. అసెంబ్లిd ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా రాష్ట్రంలో పార్లమెంటరీ ప్రవాస్‌ యోజన కింద కేంద్ర మంత్రుల పర్యటనలు కొనసాగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement