Tuesday, April 16, 2024

Big story | సొంత వనరులపై భారీ ఆశలు.. సంక్షేమ భారీ బడ్జెట్‌!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రస్తుత ఏడాది వృద్ధిరేటు ఆధారంగా 2023-24 ఆర్థిక ఏడాది బడ్జెట్‌ అంచనాలు సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి 3న ప్రవేశపెట్టనున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ.3లక్షల కోట్లను మించి అంతమేర ఆదాయ లక్ష్యాలూ భారీగానే పెరగనున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో వచ్చే వార్షిక బడ్జెట్‌ను రూ.3లక్షల కోట్ల సమీపానికి తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో అంచనాల మేరకు సొంత రాబడులు ఖజానాకు చేరడంతో పన్నుల ఆదాయంతోపాటు పన్నేతర ఆదాయాలకు 15శాతం నుంచి 20శాతం పెంచుకునేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్థికశాఖ అంచనాలను సిద్ధం చేసింది. శాఖల వారీగా సమగ్ర నివేదికలను సేకరించిన ఆర్థికశాఖ తదనుగుణంగా అంచనాలను కూర్పు చేస్తోంది.

ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలకు పెద్దపీట వేయడంతోపాటు గత ఎన్నికల హామీల అమలు, పీఆర్‌సీకి నిధులు డీఏకి కేటాయింపులు, కొత్తగా 80వేల నియామకాలకు బడ్జెట్‌లో వేతనాల కేటాయింపు దిశగా బడ్జెట్‌ రూపొందుతోంది. కేంద్రం నుంచి తెలంగాణకు అందే సహకారం రుణాలపై ఆంక్షల తొలగింపు, కార్పోరేషన్ల అప్పులపై ఇబ్బందులపై నెలకొన్న సందిగ్దతలను పరిగణనలోనికి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పన్నేతర ఆదాయంతోపాటు సొంత రాబడులను గణనీయంగా పెంచుకోవడంతోనూ లక్ష్యం చేరుతామని భావిస్తోంది. ఈ లక్ష్యాల ఆధారంగానే భారీ బడ్జెట్‌కు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం అన్ని సొంత రాబడుల శాఖలపై బారీ లక్ష్యాలను మోపుతున్నట్లు తెలిసింది. డిసెంబరు వరకు వచ్చిన రాబడి అంచనాల ఆధారంగా వచ్చే ఏడాది లక్ష్యాలను భారీగా పెంచుతూ అంచనాలను పొందుపరిచినట్లు సమాచారం.

ప్రస్తుత ఏడాది లక్ష్యం చేరిక…?

- Advertisement -

ప్రస్తుత ఆర్థిక ఏడాది రూ.2.52లక్షల కోట్ల బడ్జెట్‌లో సవరించిన అంచనాల ప్రకారం 2లక్షల కోట్లకుచేరుకుంటామని ప్రభుత్వం ధీమాగా ఉంది. దీనిపై మరో లక్ష కోట్ల పెంపుకు ఉన్న అన్ని అవకాశాలను పరిగణనలోనికి తీసుకున్న ప్రభుత్వం బడ్జెట్‌ పరిమాణాన్ని పెంచే అన్ని అంశాలపై విస్తృత కసరత్తు చేసింది. 2023-24 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర పన్నుల రాబడిని 15నుంచి20శాతం వృద్ధిరేటు అంచనా వేస్తున్నట్లు తెలిసింది. వాణిజ్యపన్నులశాఖలో పెండింగ్‌ బకాయిల వసూళ్లు, వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్లు కొత్తగా పన్ను పరిధిని విస్తరించడం, స్టాంపులు రిజిస్ట్రేషన్‌ల శాఖలో ఆదాయం పెంపుకు మరోసారి మార్కెట్‌ విలువల పెంపు, ఎల్‌ఆర్‌ఎస్‌, యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణ తదితరాల ద్వారా రాబడిని పెంచుకోవాలని చూస్తోంది. రెండేళ్ల ఎక్సైజ్‌ పాలసీ ఈ ఏడాదితో ముగియనున్న తరుణంలో వచ్చే ఆర్ధిక ఏడాది నూతన ఎక్సైజ్‌ పాలసీతో మరో ఆరేడువేల కోట్ల రూపాయలను అదనంగా ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది.

ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సొంత వనరులపై రూ.1,26,606 కోట్లను అంచనా వేసుకోగా డిసెంబరు చివరినాటికి దాదాపు 95శాతం లక్ష్యం చేరి గడచిన 9 నెలల్లో రూ. 1లక్ష కోట్లకు చేరినట్లుగా సమాచారం. పన్నేతర రాబడి కూడా రూ. 10వేల కోట్లకు చేరడంతో వాస్తవ రాబడి అంచనాలు 95శాతానికి చేరినట్లు ప్రభుత్వం ధృవీకరించుకుంది. ఈ నేపథ్యంలో ఆయా అన్ని రాబడి వనరులపై అదనపు భారం మోపేందుకు సిద్ధమైంది. అమ్మకం పన్ను, జీఎస్టీ, ఎక్సైజ్‌, రవాణా, ఇసుకరీచ్‌ల వంటి వాటిపై అదనంగా రూ.20వేల కోట్ల ఆదాయంతోపాటు పన్నేతర ఆదాయం రూ. 25వేలకోట్లకు లక్ష్యంగా నిర్దేశించుకోవాలని భావిస్తోంది.

రుణాలపై ఆశలు భారీగానే…

ఈ ఏడాది రూ.52, 257 కోట్ల రుణాలను తీసుకోవాలని భావించిన ప్రభుత్వానికి 8 నెలల్లో కేవలం రూ.26వేల కోట్ల రూపాయలు మాత్రమే సమకూరాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్రం నియంత్రణలను ఎత్తివేస్తే మరో రూ. 50వేల కోట్ల అప్పుకు అంచనాలు పెట్టుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే భారీ బడ్జెట్‌ దిశగా రాష్ట్ర ప్రభుత్వం భారీ అంచనాలతో సమగ్రంగా సిద్దమైనట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement