Wednesday, March 27, 2024

Delhi: పింఛన్‌దారులకు మెరుగైన సేవలు.. ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ కోసం ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా పింఛన్‌దారుల సమస్యల పరిష్కారానికి కేంద్రం పెద్దపీట వేయనుంది. కేంద్ర ప్రభుత్వ పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ (డిఓపీపీడబ్ల్యూ) కార్యదర్శి వి శ్రీనివాస్ రెండు రోజుల బ్యాంకర్ల అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ప్రారంభించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు సీజీఎం గౌరీ ప్రసాద్ శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెన్షన్ వ్యవహారాలు చూసే 50 మందికి పైగా అధికారులు ఈ 2-రోజుల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పెన్షనర్లకు ఇబ్బందులు లేకుండా అందించే సేవలు, వాటి అనుభవాలను శ్రీనివాస్, తన ప్రారంభోపన్యాసంలో వివరించారు.

‘ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్’, పెన్షనర్స్ వెల్ఫేర్ పోర్టల్ ‘భవిష్య’, వివిధ బ్యాంకుల పెన్షన్ పోర్టల్‌లను లింక్ చేయడం, పెన్షనర్లు, ప్రభుత్వం, బ్యాంకర్ల మధ్య అరమరికలు లేని పరస్పర అవగాహనను, సమన్వయం చేసుకోడానికి ఒక వ్యవస్థను రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకుల సహకారంతో డిజిటల్ సిస్టమ్‌లను రూపొందించడానికి కేంద్రం సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా పెన్షన్ వ్యవస్థలో సమస్యలు, వ్యక్తులకు సంబంధించిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు.

ఇప్పటికే 2014లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాగా, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ పరికరాలు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కి చెందిన 1,90,000 మంది గ్రామీణ డాక్ సేవక్‌లు, బ్యాంకుల ద్వారా డోర్‌స్టెప్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలను కూడా కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ఏడాది నవంబర్‌లో ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ప్రారంభించడంతో పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడం మరింత సులభతరమైంది. తద్వారా పెన్షనర్ల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియలో బ్యాంక్ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెన్షనర్ల ఫిర్యాదులను అర్థం చేసుకోవడం కూడా కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

ఈ అవగాహన కార్యక్రమాలు బ్యాంకు అధికారులకు భారీ సామర్థ్య నిర్మాణ వ్యాయామంగా ఉపయోగపడతాయని ఉన్నతాధికారులు తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహకారంతో దేశవ్యాప్తంగా నాలుగు అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదే తరహాలో 2022-23లో ఇతర పెన్షన్ పంపిణీ బ్యాంకుల సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement