Tuesday, April 23, 2024

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాల్సిందే : ఆర్.కృష్ణయ్య

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సుప్రీంకోర్టు, హైకోర్టు పదవుల్లో, పదోన్నతల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు (వైఎస్సార్సీపీ) ఆర్. కృష్ణయ్య అన్నారు. గురువారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన చట్టసభల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు అమలుచేయాలని, ఆ మేరకు పార్లమెంట్‌లో వెంటనే బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి అంటూ రెండు సార్లు అధికారంలోకి వచ్చారని, కానీ ఆ వర్గాలకు ఆయన చేసిందేమీ లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంటులో బిల్లు పెట్టి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆర్. కృష్ణయ్య అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అప్పుల్లో మాత్రమే బీసీలకు వాటా పంచుతున్నారు తప్ప నిధుల్లో మాత్రం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జానాభా దామాషా ప్రకారం బీసీల రిజర్వేషన్లను 27 శాతం నుంచి 56 శాతానికి పెంచాలని అన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం అమలవుతున్న పథకాలను జాతీయస్థాయిలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ప్రోత్సహించాలని, తదుపరి జరిపే జనాభా లెక్కల సేకరణలో కులాలవారీగా గణన చేపట్టాలని డిమాండ్ చేశారు.

బీసీల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అంతకు ముంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్ వద్ద బీసీ సంఘాల నేతలు ధర్నా ప్రదర్శన చేపట్టారు. ఈ ధర్నాలో ఆర్. కృష్ణయ్యతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జబ్బల శ్రీనివాస్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అంగిరేకుల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బీసీల డిమాండ్లు నెరవేర్చకపోతే తిరుగుబాటు తప్పదని నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement