Tuesday, May 30, 2023

బందీఖానాలో బ‌ట్టీ చ‌దువులు..!

ప్రభ న్యూస్‌ బ్యూరో, ఉమ్మడి మెదక్‌ : కార్పొరేట్‌ విద్యా సంస్థలైన చైనా( శ్రీ చైతన్య, నారాయణ) లాంటి వాటి చాతుర్యానికి బలైపోతు న్న ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రెండేళ్ల పాటు హాస్టల్‌లో కొనసాగించేందుకు వారి వలలో పడిపోతున్నారు. ఫలితంగా ఎంతో మంది పల్లెల నుండి పట్నానికి వచ్చి కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు ఇక్కడి వాతావరణాన్ని త్వరగా ఆకలింపు చేసుకోలేకపో తున్నారు. ఇంటర్‌కు ముందు అంటే 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులు తమ తల్లిదండ్రుల వద్ద స్వేచ్ఛా వాతావరణంలో పెరిగి ఉన్న ఫలంగా ఒక్కసారిగా రెండేళ్ల ‘ఖెదు’ అనుభవించలేక తమలో తాము సతమతమవుతూ విపరీతమైన మానసికవేధనకు గురవుతున్నారు. తమ తల్లిదండ్రులు కాయా,కష్టం, అప్పు చేసి మరీ ఒక్కసారిగా లక్షల ఫీజులు పోసి చదివిస్తుండటం తమ భవిష్యత్తు కోసమే అనే భావన వారిలో పెనవేసుకుని అత్యుత్తమంగా చదువలేక చాలా మంది చతికిలపడిపోతున్నారు. కొండంత సెలబస్‌ను తమను తాము జీర్ణించుకుని ఆకలింపు చేసేకోలేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా సెలబస్‌ను పూర్తిగా బట్టిపట్టే పక్రియలో విద్యార్థిని, విద్యార్థులు సమిదలవుతున్నారు. ఈ క్రమంలో కార్పొరేట్‌ కళాశాలలు వెనుకపడ్డ విద్యార్థులకు స్పెషల్‌ క్లాసులంటూ మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయాన్ని అధ్యాయపకులు తూచాతప్పకుండా పాటిస్తున్నారు. కొంత మంది అధ్యాపకులు టార్గెట్‌ ఇస్తుండటంతో తమ బ్యాచ్‌లోని విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దా లనే ఉద్దేశ్యంతో వారి పై తీవ్ర ఒత్తిడి పెంచుకున్నారు. ఈ క్రమంలో మిడిల్‌ క్లాస్‌ స్టూడెంట్స్‌ రోజుకోసారి, వారానికోసారి, ప్రత్యేకంగా జరిగే టెస్టుల్లో వెనుకబడిపోతు న్నారు. ఇలాంటి వారి పై అధ్యాపకులు సైతం టార్గెట్‌ చేస్తున్నారు. ఉత్తమంగా చదవలేక, సెలబస్‌ను కంప్లీట్‌ చేయలేక బట్టీ చదువులకు అలవాటుపడుతున్నారు. ఈక్రమంలో తమలో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభకు పూర్తిగా పుల్‌స్టాప్‌ పెడుతున్నారు. అధ్యాపకులు సైతం ఏ మెథడ్‌లో చెబితే విద్యార్థులు గ్రహిస్తారు అనే అంశాన్ని మేనేజ్‌మెంట్‌ టార్గెట్స్‌తో ఏనాడో మర్చిపోయారు. ఎంత సేపటికి మేనేజ్‌మెంట్‌ పెట్టే టెస్టుల్లో ప్రతిభ చూపారా లేదా అనే అంశాన్ని మాత్రమే ఇక్కడ కొలమాణంగా పరిగణిస్తు న్నారు. వెనుకబడ్డ విద్యార్థులకు సింపుల్‌గా అర్థమయ్యే మెథడ్‌లో చెప్పేందుకు అధ్యాపకులకు సైతం టైం లేకపోవడం, వేలకు వేలు ఒక్కో క్యాంపస్‌లో విద్యార్థులు ఉండటంతో ఇంట్రెస్టు ఉండి విద్యార్థులను గాడిలో పెడుతామనుకున్న అధ్యాపకులు సైతం ఎందుకొచ్చిందిలే గొడవ అంటూ సైడ్‌ అయిపోతున్నారు. ఈ క్రమంలో మిడిల్‌ క్లాస్‌ స్టూడెంట్స్‌ మిడిల్‌ క్లాస్‌గానే ఉండిపో తున్నారు. బట్టి చదువులతో తాము ప్రతిభచూ పిస్తున్నామనుకుంటున్న వందలాది మంది విద్యార్థులు చైనా లాంటి క్యాంపస్‌లు దాటాక ఇబ్బందుల పాలవుతున్నారు.


పిల్లల భవిష్యత్తు అంటూ రెండేళ్లు ‘ఖైదు’
పదివరకు పదిలంగా తల్లిదండ్రుల వద్ద పెరిగిన ఎంతో మంది విద్యార్థిని, విద్యార్థులు కొత్త లక్ష్యాలతో మహానగంరలోని కార్పొరేట్‌ విద్యాసం స్థల్లో జాయిన్‌ అవుతున్నారు. కొంత మంది ఇష్టంగా జాయిన్‌ అయితే కొంత మంది అయిష్టంగానే జాయిన్‌ అవుతున్నారు. మరి కొంత మంది తమ స్నేహితుల కోసం మరీ పట్టుబట్టి వారి తల్లిదండ్రుల మీద ప్రెషర్‌ పెట్టి మరీ కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో జాయిన్‌ అవుతున్నారు. ఇలా ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో విద్యనభ్యసించడానికి హాస్టళ్లలోని ఆయా క్యాంపస్‌లోకి ఎంటరైన విద్యార్థులు ఒక్క సారిగా మారిన వాతావరణాన్ని ఆకలింపు చేసుకోలేకపో తున్నారు. అంతకు క్రితం వరకు పాఠశాలల్లో చదువు పూర్తికాగానే ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల వద్ద మెలిగిన వాతావరణం ఒక్కసారిగా దూరమై కేవలం స్నేహితులు తోటి క్లాస్‌మెంట్స్‌ మాత్రమే తమ వాతావరణమైపోతుంది. ప్రథమ సంవత్స రంలో జాయిన్‌ అయిన తర్వాత ఒకటి రెండు వారాలు కొత్తగా ఉత్సాహంగా అనిపించినా రానురాను విద్యార్థుల్లో కొంత అలజడి మొదలైపో తుంది. తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడాలన్నా నిర్ణీత టైంటేబుల్‌ ఉండటంతో ఆయా క్యాంపస్‌లో వేలాది స్టూడెంట్స్‌ మధ్య తమకెప్పు డు మాట్లాడే టైం వస్తుందోనని క్యాంపసుల్లో ఆశగా ఎదురుచూస్తుంటారు. ఇక ఆడిబిడ్డలు( విద్యార్థినిలు) పరిస్థితి చెప్పనలవి. అప్పుడే కౌమారదశకు రావడం శారీరకంగా వారిలో వచ్చే మార్పు, ఇబ్బందులను ఇతరులకు చెప్పుకునేం దుకు ఇబ్బంది పడటం వర్ణనాణీతం. ఇక సెలవు దినాలు ముఖ్యంగా ఆదివారం వచ్చినా విద్యార్థులు పుస్తకాలతో మాత్రమే కుస్తీపట్టాలి. కొంత సమయం విరామం ఇస్తే కిటికిల్లోంచి బయటి ప్రపంచాన్ని చూస్తూ ఆనందించే ఎంతో మంది విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. రెండు సంవత్సరాలు ఎలా గడుస్తాయిరా బాబు అంటూ స్నేహితులు, క్లాస్‌మెంట్స్‌తో చర్చించుకుంటూ రాత్రుళ్లు నిద్రొస్తున్నా అవే ఆలోచనలతో మునిగిపోతుం టారు. కొంత మంది తమ తల్లిదండ్రులను, సొంతూళ్లో ఉన్న ఫ్రెండ్స్‌ను మిస్సయ్యామని మనోవేధనకు గురవుతుంటారు. ఈ క్రమంలో చదువు అనే ఒత్తిడిని జయించలేక, అధ్యాపకుల ఫ్రెషర్‌ను తట్టుకోలేక ,ర్యాంకుల వేటలో పరుగెత్తలేక, ఇంటి వద్ద తల్లిదండ్రుల పరిస్థితిని అర్థం చేసుకుని వారికేసమాధానం చెప్పాలో తెలియక వారిలో వారు మథన పడుతూ కృంగిపోతూ అత్మానూన్యతాభావంలో కొట్టు మిట్టాడుతూ సైకాలజీగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో చదువులో వెనకపడిపోయి రెండేళ్ల ఖైదు జీవితాన్ని కేవలం నాలుగుగోడల మద్య అనుభవించలేక, ఫ్రెషర్‌ తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

- Advertisement -
   


బట్టీ చదువులతో విద్యార్థులో దాగి ఉన్న టాలెంట్‌ గోవిందా
ముఖ్యంగా కార్పొరేట్‌ విద్యా సంస్థలు(చై..నా లాంటివి) తమ సంస్థకు ర్యాంకుల పంట పండాలని లెక్చరర్స్‌కు టార్గెట్స్‌ విధిస్తుం డటంతో ఆ ఒత్తిడితో లెక్చరర్స్‌ తమ గ్రూప్‌లో పిల్లలు ఉత్తమంగా చదువాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో బట్టీ చదువులకు లెక్చరర్స్‌ జేజేలు పలుకున్నారు. ఆల్రెడీ ప్రీపేర్‌ చేసి ప్రింట్‌ తీసిన మెటీరియల్‌ను విద్యార్థులచే బట్టీ కొట్టిస్తున్నారు. ఫలితంగా విద్యార్థుల్లో దాగి ఉన్న టాలెంట్‌ వెలికితీయకపోగా ఉన్నది కాస్త గోవింద అనే రీతిలో కార్పొరేట్‌ చదువులు కొనసాగుతున్నాయి. ఇక స్పెషల్‌ సెలబస్‌ అంటే ఐఐటీ, జేఈఈ, ఏఐఈఈఈ, నీట్‌ బ్యాచ్‌ల విద్యార్థుల ఒత్తిడి చెప్పజా లవు. ఉదయం నిద్రలేవగానే మొదలు రాత్రిళ్లు పొద్దుపోయే వరకు స్పెషల్‌ క్లాసులంటూ రుద్దుడే.. రుద్దుడు. చదువు.. చదువు తప్ప వేరే ధ్యాస లేకపోవడంతో మానసిక ప్రశాంతత కరువై, స్వేచ్ఛ కరువై వారిలో ఉన్న టాలెంట్‌కు పులస్టాప్‌ పడుతుంది.


కౌమారదశలో జాగ్రత్తలేవి?
ప్రతి మనిషికి కౌమార దశ ఒక్కటే జీవితంలో వేగంగా పెరిగే సమయం. ఈ క్రమంలో ప్రతి మనిషికి సరైన ఆహారంతో పాటు నిర్థిష్టమైన నిద్ర, ప్రశాంతత, స్వేచ్ఛ అవసరమై తాయి కనుకనే విదేశాల్లో 14 సంవత్సరాలు నిండగానే తల్లిదండ్రులు తమ సంతానాన్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో వదిలేస్తారు. వారి నిర్ణయాలు వారే తీసుకోవడం, ఆహార నిర్ణయాలు వారికి వారే నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఇక మన దేశంలో ఇంటర్‌ విద్యను ఒత్తిళ్ల నే సుడిగుండంలోకి నెట్టివేయడంతో విద్యార్థిని, విద్యార్థుల కౌమారదశ ప్రశ్నార్థకంగా మారిపో తుంది. కార్పొరేట్‌ కళాశాలలు సరైన ఆహారాన్ని విద్యార్థులకు( కౌమార దశకు వచ్చిన వారికి) అందజేస్తున్నా సరైన కొలమాణంలో అందించడంలేదు. కౌమారదశలో ఉన్న పిల్లలకు కేలరీల అవసరాలు, వారి ఎదుగుదల, శారీరక పరిణితి, శరీర నిర్మాణం, చురుకుదనపు స్థాయిలను బట్టి మారుతూ ఉంటు-ంది. బాలికలు తాము తీసుకునే కేలరీల పరిమాణం కారణంగా అత్యధికంగా ఋతుక్రమం మొదలయ్యే ముందు (దాదాపు 12 సంవత్సరాలు వయసు నుండి ) అత్యధిక ఆవశ్యకత క్రమంగా తగ్గుతూ 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి నిర్దిష్టస్థాయికి చేరుకుంటుంది. ఇక బాలులకు అత్యంత కేలరీల అవసరయ్యే దశే కౌమారదశ. ఇది ప్రారంభం అయినప్పటి నుండి సమాంతరంగా పెరిగి, 16 సంవత్సరాలు వయసు వచ్చేసరికి అధికమై, తరువాత క్రమంగా తగ్గుతూ, 19 సంవత్సరాల వయసుకు నిర్దిష్ట స్థాయికి చేరుకుంటు-ంది. సరిపడినంత కాల్షియం, ఫాస్పరస్‌ మరియు విటమిన్‌ డి లను కౌమారదశలో తీసుకొనడం వలన, ఎముకలలోని ఖనిజలవణాల నిల్వలు అధికమై వృద్ధాప్యంలో వచ్చే ఆస్టియోపొరోసిస్‌ (ఎముకల బలహీన) వంటి జబ్బులు అరికట్టబడతాయి. కాని కార్పొరేట్‌ కళాశాలల్లో కేవలం చదువు తప్ప విద్యార్థిని, విద్యార్థులకు ఆరోగ్య పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించడం లేదు. వైద్యులచే వారు పెరిగే వాతావరణం, అవసరమైన పోషకాహారం టైంటేబుల్‌ను అనుసరించి ఇవ్వడం లేదు. దీంతో వారి శరీరంలో జరిగే మార్పు కూడా మెదడు పై ప్రభాపం చూపుతుంది. ఫలితంగా మానసిక ఒత్తిడి సహజంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో కార్పొరేట్‌ కళాశాలలు విధించే చదువను ఒత్తిడిని జయించలేక కూడా ఆత్మహత్యలు జరుగుతు న్నాయని సైకాలజీ నిపుణులు పేర్కొంటున్నారు.


తల్లిదండ్రుల్లారా ఆలోచించండి ?
కార్పొరేట్‌ విద్య అనే ముసుగులో పడి మోసపోతున్న వేలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లల శారీరక ఎదుగుదల ఎంత దృడంగా జరుగుతుందన్న వాస్తవాన్ని పట్టించుకోవడం లేదు. కేవలం చదువును మాత్రమే కొలమాణంగా చూస్తూ మిగతా విషయాలను విద్యార్థుల తల్లిదం డ్రులు పట్టించుకోవడం లేదు. పేరెంట్స్‌ మీట్‌ లాంటి సందర్భాల్లో తమ పిల్లలను చూసేందుకు వస్తున్న తల్లిదండ్రులు ఫుడ్‌ ఎలా ఉందని మాత్రమే అడుగుతున్నారు తప్పితే కౌమార దశలో వారికేవిధమైన ఫుడ్‌ అందుతుందనే విషయాన్ని మరుస్తున్నారు. కొందరు పిల్లలు ఫుడ్‌ బాగాలేదని చెబుతున్నా తల్లిదండ్రులే వారించి ఓపిక చేసుకుని చదువాలి బిడ్డా.. మీ కోసమే మేం కష్టపడుతున్నామని నూరిపోస్తుండటంతో విద్యార్థిని, విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని కూడా మిన్నుకుండిపోతున్నారు. ఇలా ఎంతో మంది విద్యార్థిని, విద్యార్థులు సరైన ఫుడ్‌ అందక ముఖ్యంగా బాలికలు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక కృంగుబాటుకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే కార్పొరేట్‌ విద్యా సంస్థల క్యాంపస్‌ పరిధిలో ఎంతో మంది సెన్సిటీవ్‌ విద్యార్థులు ఉరితాళ్లకు బలైన ఘటనలు మన రాష్ట్రంలో ఎన్నో చూశాం.. ఎన్నో విన్నాం.. అలాంటి వారి బాధలు తమ పిల్లలు కూడా పడొద్దని తల్లిదండ్రులు కోరుకోవాలి. తమ పిల్లల్లో సహజంగా దాగి ఉన్న ప్రతిభను గుర్తించి అందులోనే వారు రాణించాలని ఆకాక్షించి వారిని ఆ దిశగా ప్రేరేపించి పూర్తి స్వేచ్చను ఇవ్వాలి. ఫలితంగా ఎంతో మంది టెండుల్కర్లు, విరాట్‌కోహ్లీలు, పిటీ ఊషలు, అబ్ధుల్‌ కలాంలు, అంబేద్కర్‌లు, ధ్యాన్‌చంద్‌లు, ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తిలు, సత్యనాథెల్లలు, సుందర్‌ పిచాయ్‌లు, లీనా నాయర్లు, ఇంద్ర నూయిలు దేశం మెచ్చే భావి పౌరులుగా పుట్టుకొస్తారు. తల్లిదండ్రుల్లారా కార్పొరేట్‌ విద్యా సంస్థల వలలో పడకుండా మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందివ్వండి. స్వేచ్చాయుత వాతావరణాన్ని కల్పించండి.. వారిని సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రేరేపించండి, వారిలో ఏ అంశం పై ఆసక్తి ఉందో గ్రహించండి ఆ దిశగా వారిలో ఎంకరేజ్‌ కల్పించండి. ఇలా చేయడం కారణంగా బిడ్డల భవిష్యత్తు ఉజ్వలంగా మారి తీరుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement