Friday, March 29, 2024

పీఎస్‌బీల క్యు-3 ఫలితాలలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర టాప్‌..

ప్రభుత్వరంగ బ్యాంకులలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర మెరుగైన పనితీరును కనబరుస్తోంది. డిసెంబర్‌ 2022తో ముగిసిన త్రైమాసికానికి అత్యుత్తమ ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీ) 65 శాతం లాభాలను ప్రకటించాయి. రూ.29,175 కోట్ల బలమైన లాభ వద్ధిని నమోదు చేశాయి. ఇందులో పుణ ప్రధాన కేంద్రంగా బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఏకంగా 139శాతం లాభాలతో అబ్బురపరిచింది. 12 ఫిబ్రవరి 2023న ప్రకటించిన ఫలితాల ప్రకారం బీఒఎం నికర లాభం రూ.775 కోట్లకు చేరింది. లాభాల వృద్ధి పరంగా పీఎస్‌బీలలో బీఓఎం టాప్‌ పెర్‌ఫార్మర్‌గా నిలిచింది.

ఈ జాబితాలో బీఒఎం తర్వాత, కోల్‌కతాకు చెందిన యూకో బ్యాంక్‌ రూ.653 కోట్ల లాభాన్ని నమోదు చేసి రెండవ స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన దానికంటే ఇది 110 శాతం అధికం. 100శాతం కంటే ఎక్కువ లాభాలను ప్రకటించిన పీఎస్‌బీల జాబితాలో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్‌ చోటు దక్కించుకున్నాయి. ముంబైకి చెందిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నికరలాభం 107 శాతం పెరిగి రూ. 2,245 కోట్లకు చేరుకుంది. అదేవిధంగా, చెన్నైకి చెందిన ఇండియన్‌ బ్యాంక్‌ లాభం 102 శాతం వృద్ధితో రూ.1396 కోట్లకుచేరింది.

మొత్తం 12 ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రౖౖెమాసికంలో రూ.29,175 కోట్ల లాభాలను ఆర్జించాయి. గతేడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ. 17,729 కోట్లుగా ఉండేది. ఇంటే దాదాపు 65 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిదినెలలకు పీఎస్‌బీలు రూ.70,166కోట్ల సంచిత లాభాన్ని ఆర్జించాయి. గతేడాదితో పోల్చితే రూ.48,983 కోట్లు (43శాతం) అధికం. పీఎస్‌బీలు మొదటి త్రైమాసికంలో దాదాపు రూ. 15,306 కోట్ల నికర లాభాల్ని ప్రకటించగా, ఇది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.25,685 కోట్లకు, డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.29,175 కోట్లకు పెరిగింది.

- Advertisement -

క్యాపిటల్‌ అడిక్వసీ రేషియోకి సంబంధించి గతేడాది డిసెంబర్‌ 31 నాటికి పీఎస్‌బీలలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర అత్యధికంగా 17.53 శాతంగా ఉంది. తర్వాతి స్థానాల్లో కెనరా బ్యాంక్‌ 16.72శాతం, ఇండియన్‌ బ్యాంక్‌ 15.74 శాతంతో ఉన్నాయి. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) విషయంలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అత్యల్ప క్వార్టైల్‌లో ఉన్నాయి. ఈరెండింటి మొండి బకాయిలు 2.94, 3.14 శాతంగా ఉన్నాయి. మునుపటితో పోల్చితే ఎన్‌పీఏలు వరుసగా 0.47శాతం, 0.77 శాతం తగ్గాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement