Saturday, April 20, 2024

ఎంపీ ని అంత దారుణంగా ఎలా కొడతారు….అధికారం ఒకరిదగ్గర ఉండదు – బండి

ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుపై ఏపీ సీఐడీ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గౌరవ ఎంపీ ని లోక్ సభ స్పీకర్ అనుమతి లేకుండా అరెస్టు చేయడానికే అనుమతి ఉండదు… అట్లాంటిది ఒక ఎంపీని అరికాళ్లు కందిపోయేలా కొడుతారా అని ప్రశ్నించారు.ఎంపీగారి కాళ్ల గాయాలు చూస్తుంటే ఆయన ను ఏపీ సీఐడీ పోలీసులు చాలా దుర్మార్గంగా కొట్టారని స్పష్టం అవుతోంది. సామాన్య పౌరులకే కొట్టడానికి పోలీసులకు అధికారం ఉండదు. అట్లాంటిది ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ఒక గౌరవ ఎంపీపై అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తారా అని మండిపడ్డారు. ఏపీలో ప్రజా స్వామ్యం ఉందా – నియంతృత్వం కొనసాగుతోందా అని ప్రశ్నించారు.

కేసు ఏదైనా ఉండొచ్చు, ఏపీ సీఐడీ పోలీసులు నిరూపించగలిగితే గౌరవ కోర్టు శిక్ష వేస్తుంది. కాని చట్టాన్ని చేతులోకి తీసుకుని ఒక ఎంపీపై విచక్షణా రహితంగా దాడి చేస్తారా? కొందరి మెప్పుకోసం పోలీసులు ఎంపీ పై అత్యంత క్రూరంగా వ్యవహరించినట్లు స్పష్టం అవుతోంది. అందరూ చట్టం పరిధిలోనే వ్యవహరించాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులు, పాలకులు శాశ్వతం కాదని పోలీసులు గుర్తుంచుకోవాలి. పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తాం. గౌరవ ఎంపీపై విచక్షణా రహితంగా దాడిచేసిన పోలీసు అధికారులు చట్టపర చర్యలనుంచి తప్పించుకోలేరు.

దేశంలోని ఎంపీలు, ప్రజాస్వామ్య వాదులందరు పార్టీల కతీతంగా ఈ దుర్మార్గాన్ని ఖండించాలి.నాలుగు నెలల కిందట హార్ట్ సర్జరీ చేసుకున్న వ్యక్తిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా..
ఒకవైపు కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఈ టైంలో ఎంపీ రఘురామకృష్ణం రాజును అరెస్టు చేయడం, ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం చూస్తుంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం ఉందన్న అనుమానం కలుగుతోందన్నారు బండి.

ఏ రాష్ట్రంలో అయినా ఎవరిపాలనా కూడా శాశ్వతం కాదని పోలీసులు గుర్తించుకోవాలి. రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోలేక క్రూరంగా వ్యవహరించడం అప్రజాస్వామికం.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలపై కేసులు బనాయించడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను.
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైనా మీడియాను నియంత్రించడం నియంత్రుత్వానికి నిదర్శనమని అన్నారు బండి సంజయ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement