Wednesday, June 16, 2021

జర్నలిస్ట్ రఘు అరెస్టును ఖండించిన బీజేపీ ఎంపీ బండి సంజయ్

ప్రముఖ జర్నలిస్ట్ రఘును పోలీసులు అరెస్ట్ చేయడంపై బీజేపీ ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఇవాళ రఘుకు జరిగిందే రేపు మరో జర్నలిస్టుకు జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. గుర్రంపోడు తండా వద్ద ఘర్షణలకు ఆజ్యం పోశాడని, పోలీసులపై దాడులకు కారకుడయ్యాడని ఆరోపిస్తూ రఘుపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రఘును హుజూర్ నగర్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం రఘు హుజూర్ నగర్ సబ్ జైలులో ఉన్నారు.

దీనిపై తీవ్రస్థాయిలో స్పందించిన బండి సంజయ్… సీనియర్ జర్నలిస్టు రఘు అరెస్టును ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపితే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గం గుర్రంపోడు తండా గిరిజన భూములను అధికార పార్టీ నేతలు ఆక్రమిస్తే ఆ భూభాగోతాన్ని మీడియాలో చూపించినందుకు రఘుపై కేసు నమోదు చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే మీడియా బాధ్యత అని పేర్కొన్నారు. కానీ అక్రమ కేసులతో మీడియా గొంతును మూయించాలని ఈ ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు ఇది నిదర్శనమని, అధికార పార్టీ నేతల కబ్జాలపై వార్తలు రాస్తే కేసులు పెడతామని కేసీఆర్ సర్కారు సంకేతాలను ఇస్తోందని వివరించారు. వాస్తవాలను రాసే జర్నలిస్టులపై కేసులు పెడితే జైళ్లన్నీ వాళ్లతోనే నిండిపోతాయని, అందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం వంటి మీడియా ప్రతినిధులపై ఈ అమానుష చర్యలేంటి? అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పాత్ర కూడా ఎంతో ఉందని, అలాంటిది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుని 24 గంటల గడవకముందే ఒక సీనియర్ పాత్రికేయుడ్ని కిడ్నాప్ తరహాలో అరెస్ట్ చేస్తారా? అని బండి సంజయ్ నిలదీశారు.

జర్నలిస్ట్ రఘు అరెస్టును ఖండించిన బీజేపీ ఎంపీ బండి సంజయ్
Advertisement

తాజా వార్తలు

Prabha News