Thursday, April 25, 2024

కొమురం భీం పేరుతో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌.. 45వేల ఎకరాలకు సాగునీరు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జల్‌, జమీన్‌, జంగిల్‌ నినాదంతో నిజాంసేనలకు వ్యతిరేకంగా పోరాడిన కొమురంభీం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జలాశయం నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. నాయికపోడు, పోలాంకోసం, గొండుల కోసం ఆయుధమెత్తి సాయుధుడైన కొమురం భీంను తరతరాలుగా ప్రజల మనోపుటల్లో నిలిచిపోయే విధంగా గిరిజనప్రాంతాలు కొమురం కోరుకున్న విధంగా అభివృద్ధి చేసేందుకు ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వం వేగం పెంచింది. కొమురంభీం ప్రాజెక్టు ఆసిఫాబాద్‌ మండలానికి 13కిలోమీటర్ల దూరంలో కొమురం పోరాటం చేసిన ప్రాంతాలను కలుపుతూ ప్రాణహిత ఉపనది పెద్దవాగుపై ప్రతిపాదించిన మధ్యతరగతి సాగునీటి ప్రాజెక్టు. కొమురంభీమ్‌ జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌ నగర్‌, వాంకిడి, సిర్పూర్‌ మండలాల్లోని 24,500ఎకరాల ఆయకట్టు ఈ ప్రాజెక్టు పరిధిలోకి రానుంది. ప్రాజెక్టుకు సవరించిన అంచనావ్యయం రూ.882.36 కోట్లకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చి పనుల్లో వేగం పెంచింది. జూన్‌ 2023 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

- Advertisement -

అయితే మొదట 21వేల ఎకరాలకు రూపొందించిన డీపీఆర్‌ను 45,500 ఎకరాలకు సవరించడంతో నిర్ణీత గడువులో పనులు పూర్తి కాలేదు. హెడ్‌ రెగ్యూలేటర్‌ పనులు పూర్తి అయి కాలువల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అలాగే ఎల్‌ఎఫ్‌ ప్రధాన కాలువ నీటిని తీసుకుపోయే సామర్థ్యాన్ని పెంచడం కోసం నిర్మాణ పనులు చేపట్టారు. ప్రస్తుతమున్న చెరువును బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా అభివృద్ధి చేయడం, ఎల్‌ఎఫ్‌ ప్రధాన కాలువ 15వేల ఎకరాల అదనపు ఆయకట్టు ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రాజెక్టు దిగువతీరం నుంచి కాలువను ఏర్పాటు చేసి 6 వేల ఎకరాలకు సాగునీటి సామర్థ్యాన్ని కల్పించనున్నారు. అయితే 65 కి.మీ మొత్తం పొడవు కాలువ పనుల్లో దాదాపుగా 64 కిలోమీటర్ల ఎల్‌ఎఫ్‌ ప్రధాన కాలువ పూర్తి అయింది. ఆర్‌ఎఫ్‌ రెగ్యూలేటరీ, ఆర్‌ఎఫ్‌ కెనాల్‌ మొత్తం పనులు పూర్తి అయ్యాయి.

భూసేకరణ ప్రధానసమస్యగా ఉండటంతో 2019లో పూర్తి కావల్సిన పనుల్లో జాప్యం జరిగింది. అయితే సమస్య అధిగమించి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణ పనులకు రూ.748.092 కోట్లు, సాగునీటి సామర్థ్యం 45,500ఎకరాలుకాగా ప్రస్తుతం 23,000 ఎకరాలకు నీరు అందించేందుకు ప్రాజెక్టుసిద్ధమైంది. మరో 22,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు పనులు సాగుతున్నయి. ఈ ప్రాజెక్టుతో నిజాం వ్యతిరేకపోరాట యోధుడు కొమురం భీం నీటి కోసం పోరాటం చేసిన ప్రాంతాల్లో పెన్‌ గంగా ఉపనది పెద్దవాగు నీళ్లు పరవళ్లు తొక్కనున్నాయి. కొమురంభీం ఆశయాలు. పోరాట నిదాలకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవం శాశ్వతంగా మనసు పుటల్లో నిలవనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement