Friday, October 4, 2024

Delhi | బాబు అరెస్టు రాజకీయ కక్షసాధింపే.. పార్లమెంటులో ఎండగడతాం : టీడీపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమమని, రాజకీయ కక్ష సాధింపులో భాగమని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ప్రకటించింది. శనివారం ఢిల్లీలోని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ నివాసంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అధ్యక్షత వహించారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చంద్రబాబు నాయుడు అరెస్టుపై గళమెత్తాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయ కక్షతో అరెస్టు చేసి వేధిస్తున్నారని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ రాజకీయ అరెస్టులను ఆపాలని విజ్ఞప్తి చేసింది. లేనిపక్షంలో ఏపీలో వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని, రాష్ట్రాభివృద్ధిని పక్కనపెట్టి అక్రమ అరెస్టులు, కక్షలే ధ్యేయంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని మండిపడింది.

- Advertisement -

మరోవైపు పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బిల్లులపై అధ్యయనం చేసి విధాన నిర్ణయం తీసుకుంటామని ప్రకటనలో పేర్కొంది. నారా లోకేశ్ అధ్యక్షతన జరిగిన భేటీలో పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్, టీడీపీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కనకమేడల రవీంద్ర కుమార్‌తో పాటు లోక్‌సభ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని), కే. రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. గత రెండ్రోజులుగా ఢిల్లీలో ఉన్న నారా లోకేశ్ ఆదివారం కూడా తన పర్యటన కొనసాగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రెండ్రోజుల్లో జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాదులు, న్యాయ నిపుణులతో చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement