Saturday, April 20, 2024

వ్యక్తిగత విమర్శల వల్ల పరిశ్రమ పరువు పోతోంది: బాబూ మోహన్

త్వరలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేపథ్యంలో ఆన్‌లైన్ టికెట్ల విష‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారగా.. దీనిపై పోసాని విమర్శల దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సినీన‌టుడు బాబూమోహ‌న్ స్పందించారు. ఆయ‌న మా ఎన్నిక‌ల్లో మంచు విష్ణు ప్యానెల్ లో ఉన్న విష‌యం తెలిసిందే. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబూమోహ‌న్‌ పోటీపడుతున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌-పోసాని వ్యాఖ్య‌లపై ఆయ‌న స్పందిస్తూ… ‘ఇద్ద‌రూ క‌లిసి క‌ళామ‌త‌ల్లి ప‌రువు తీయ‌కూడ‌దు. నిన్న మా విష్ణు బాబు ఓ ప్ర‌శ్న వేశారు. అందులోనే ఓ విష‌యం ఉంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్ని మాట‌లు మాట్లాడారు.. ఆయ‌న ఇండ‌స్ట్రీ సైడా? ప్ర‌కాశ్ రాజ్ సైడా? ముందుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ తేల్చుకోవాలి. స‌ర్కారు స‌హ‌కారం ఇండ‌స్ట్రీకి అవ‌స‌రం. ప్ర‌భుత్వాన్ని ఇండ‌స్ట్రీనే ఓ విష‌యం అడిగింది. దీనిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏదేదో మాట్లాడారు’ అన్నారు బాబూమోహ‌న్.

‘అందుకే ఇండ‌స్ట్రీ సైడా? ప్ర‌కాశ్ రాజ్ సైడా? అని ప‌వ‌న్ ను విష్ణు బాబు ప్ర‌శ్నించారు. ఏది ఏమున్నా తెర‌చాటునే అన్ని విష‌యాలు చూసుకోవాలి. అంతేగానీ, తెర‌ముందుకు వ‌చ్చి మాట్లాడ‌డం ఏంటీ? మ‌నం ఇంత చిరాకుతో మాట్లాడ‌డం ఎందుకు? చ‌క్క‌గా న‌వ్వుతూ మాట్లాడుకోవ‌చ్చు. వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న ప‌రిశ్ర‌మ ప‌రువుపోతోంది. అంత పెద్ద అన్యాయ‌మే జ‌రిగితే పెద్ద మ‌నుషుల ద‌గ్గ‌ర కూర్చొని మాట్లాడుకోవాలి’ అని బాబూమోహ‌న్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement