Thursday, March 28, 2024

ఒకే వేదికపై బాబు, జగన్.. మోదీ అధ్యక్షతన జీ-20 సన్నాహక సమావేశానికి హాజరు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాజకీయంగా భిన్న ధృవాలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతలు ఒకే వేదిక పంచుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన జీ-20 సన్నాహక అఖిలపక్ష సమావేశం ఇందుకు వేదికైంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం గం. 12.00 సమయంలో ఢిల్లీ చేరుకోగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయంత్రం గం. 4.00 సమయంలో ఢిల్లీ చేరుకున్నారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ నివాసంలో చంద్రబాబు నాయుడు పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించి, సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన జీ-20 సన్నాహక ఆల్ పార్టీ మీటింగ్‌కు హాజరయ్యారు. సీఎం జగన్ విమానాశ్రయం నుంచి జన్‌పథ్‌లోని తన నివాసానికి చేరుకుని, అక్కణ్ణుంచి జీ-20 సమావేశం వేదికకు చేరుకున్నారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మాత్రం ఎవరూ హాజరుకాలేదు.

దేశంలోని దాదాపు 40 రాజకీయ పార్టీల అధినేతలకు కేంద్రం ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1 నుంచి జీ-20 గ్రూపునకు సారథ్య బాధ్యతలను భారతదేశం స్వీకరించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ-20 సభ్యదేశాలైన అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జెర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, టర్కీ, యూకే, యూఎస్ఏ, యురోపియన్ యూనియన్ల అధినేతలతో సదస్సు జరగనుంది. ఈ సదస్సు కోసం దాదాపు 200 సన్నాహక సమావేశాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం నిర్వహించింది. సదస్సులో చర్చించాల్సిన అంశాలతో పాటు సదస్సుకు సంబంధించి ఆయా పార్టీల నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలను స్వీకరించింది.

జీ-20లో ఏపీకి ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తాం :వైఎస్ జగన్

- Advertisement -

వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న జి-20 దేశాధినేతల ప్రతిష్టాత్మక సదస్సుకు భారత్‌ వేదిక కావడం పట్ల సీఎం జగన్‌ సంతోషం వ్యక్తం చేశారు. సదస్సులో పాల్గొన్న అనంతరం సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకారం భారత సారథ్యంపై ప్రధాని మోదీకి ఆయన అభినందనలు తెలియజేశారు. జి-20 సదస్సు సన్నాహకాలు, వ్యూహాల ఖరారులో భాగంగా ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశంలో సీఎం మాట్లాడారు. జి-20 దేశాల సదస్సు కోసం చేసే ఏర్పాట్లు, దానికోసం జరిగే సన్నాహకాల్లో ఎలాంటి బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అప్పగించినా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం అన్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు విజయవంతం కావడానికి అన్నిరకాలుగా తాము సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జి-20  అధ్యక్ష పదవిని భారత్‌ చేపట్టిన ఈ సందర్భంలో రాజకీయ కోణంలో వ్యాఖ్యలు చేయడం సరికాదని, అంతర్జాతీయ సమాజం దేశంవైపు చూస్తున్న ఈ సందర్భంలో అందరూ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. రాజకీయపార్టీల మధ్య విభేదాలు సహజమని, కాని వాటిని మనవరకే పరిమితం చేసుకుని జి-20 సదస్సు విజయవంతం చేయడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి తిరుగుప్రయాణమై విజయవాడ చేరుకున్నారు.

మానవ వనరులు – డిజిటల్ నాలెడ్జ్ : చంద్రబాబు

ఇదే సమావేశంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిజిటల్ నాలెడ్జ్ అంశంపై మాట్లాడినట్టు తెలిసింది. భారతదేశ భవిష్యత్తు ప్రయాణం కోసం వచ్చే 25 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. వచ్చే పాతికేళ్లలో ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ దేశంగా అవతరిస్తుందని అన్నారు. యువశక్తి దేశానికి ఉన్న బలం అని, వారికి అవకాశాలు సృష్టించేలా విధానాల రూపకల్పన జరగాలని సూచించారు. దేశ మానవ వనరుల శక్తికి, నాలెడ్జ్ ఎకానమీ అనుసంధానించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు వస్తాయని వెల్లడించారు. సమావేశం అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు కాసేపు ముచ్చటించారు. పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు, దేశ రాజకీయాలపై మాట్లాడినట్టు తెలిసింది. అనంతరం టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి చేరుకున్న చంద్రబాబు నాయుడు, జాతీయ మీడియా ప్రతినిధులతో భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం వరకు ఆయన ఢిల్లీలోనే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement