Monday, December 9, 2024

AP: స్వచ్ఛతా హి సేవపై అవగాహన కల్పించాలి : కలెక్టర్లకు నీరబ్ కుమార్ ఆదేశం

తిరుపతి, సెప్టెంబర్ 12: సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు జరిగే స్వచ్ఛతాహి సేవ కార్యక్రమoపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కలెక్టర్లను ఆదేశించారు. ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా తిరుపతి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు 2024 లో స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత అను నినాదంతో ఈ స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం, శ్రమదానం ద్వారా చెరువుల కుంటల వద్ద వ్యర్ధపదార్థాలు తొలగింపు వంటి కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. మండల పరిషత్ అధికారులు, పంచాయతీ అధికారులు పంచాయతీ కార్యదర్శులను సమన్వయo చేసుకుంటూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో ఈనెల 14వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ, మారథాన్ రన్, వర్క్ షాపులు, మొదలగు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 17వ తేదీ నుంచి సంపూర్ణ స్వచ్ఛత కార్యక్రమం కింద అన్ని మున్సిపాల్టీల్లో, అన్ని గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు, అన్నిచోట్ల శ్రమదానం కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

- Advertisement -

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, రైల్వేస్టేషన్లు, చెత్త కుప్పలు, నల్లాల చుట్టుపక్కల మొదలగు ప్రదేశాల్లో మెగా శుభ్రత డ్రైవ్ లు నిర్వహించాలన్నారు. ఈ మెగా శుభ్రత డ్రైవ్ లు చాలా యాక్టివ్ గా నిర్వహించాలన్నారు. ఎంపీడీవోలు, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈలు, విస్తరణాధికారులు, సంబంధిత అధికారులు, గ్రామ స్థాయి సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్వచ్ఛతా హి సేవ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు. సఫాయి కర్మచారులకు సేఫ్టీ పరికరాలు అందించడం, ఆరోగ్య సదస్సులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్డీవో సుశీల దేవి, డిప్యూటీ సీఈఓ ఆదిశేషారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement