Wednesday, April 24, 2024

కెనడాలో కత్తులతో దాడులు.. 10 మంది మృతి, 15మందికి గాయాలు

కెనడాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన కత్తుల దాడులు కలకలం సృష్టించాయి. పలు ప్రాంతాలలో జరిగిన సామూహిక కత్తిపోటులలో 10మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సెంట్రల్‌ కెనడాలోని సస్కాట్చివాన్‌ ప్రావిన్స్‌లోని వెల్డన్‌ పట్టణం, స్థానిక కమ్యూనిటీలో కనీసం 13 ప్రదేశాలలో ఇద్దరు వ్యక్తులు కత్తితో విధ్వంసానికి దిగడంతో పదిమంది మరణించారు. కనీసం 15మంది గాయపడ్డారు. తమ ప్రాంతంలో కత్తిపోట్లు జరిగినట్లుగా ఒకరి నుంచి తమకు ఫోన్‌ వచ్చిందని, వెనువెంటనే ఇతర ప్రాంతాల నుంచి కూడా ఫోన్లు వచ్చాయని పోలీసులు తెలిపారు. వెంటనే ఘటనా ప్రాంతాలకు వెళ్ళిన తమకు 13 ప్రదేశాల్లో 10 మృతదేహాలు కనిపించాయని, పలువురు గాయాలతో బాధపడుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్న ఇద్దరు నిందితులను డామియన్‌ శాండర్సన్‌ (31), మెల్స్‌ శాండర్సన్‌ (3)గా పోలీసులు పేర్కొన్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. వీరు బాధితులలో కొంతమందిని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ దుర్ఘటనపై కెనడా ప్రధాన మంత్రి జస్టిస్‌ ట్రూడో ”ఇది కెనడియన్‌ చరిత్రలో అత్యంత ఘోరమైన సామూహిక హత్యలలో ఒకటి. ఈ దాడులు హృదయ విదారకమైనవి, నేను మరణించిన, గాయపడినవారి కుటుంబాల గురించి ఆలోచిస్తున్నాను, బాధపడుతున్నాను” అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన సందేశంలో స్పందించారు. ఘటనా స్థలంలో అత్యవసర పరిస్థితిని విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement