Friday, April 19, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాభవంతో అసెంబ్లీ సాక్షిగా అరాచకాలు : టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : స్పీకర్ సాక్షిగా అసెంబ్లీ సభ్యులపై దాడికి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు పడాలని టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ విమర్శించారు. సోమవారం ఆయన న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అడుగడుగునా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నిరంకుశ, నియంతృత్వ పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్ నిర్వహించే మీటింగులకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారన్న నారాయణ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు చేసినప్పుడు చంద్రబాబు ఎక్కడా అడ్డంకులు సృష్టించకపోగా, యాత్రకు వెసులుబాటు కల్పించారని గుర్తు చేశారు. అసెంబ్లీలో దాడి జరుగుతుంటే మార్షల్స్ ఏం చేస్తున్నారు? స్పీకర్ ఏం చేస్తున్నారని నిలదీశారు. పట్టభద్రుల కోటా  తట్టుకోలేకపోతున్నారని ఆయన దుయ్యబట్టారు. 

పులివెందులలో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావడంతో ఆ అసహనాన్ని శాసనసభలో చాటుకున్నారని ధ్వజమెత్తారు. చట్టసభలో శాసనసభ్యులకు రక్షణ లేకపోతే మరెక్కడ దొరుకుతుంది? సామాన్యులకు రక్షణ ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనలపై కేంద్రం జోక్యం చేసుకుని చర్యలు చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తక్షణమే రద్దు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. శాసనసభలోనే శాంతిభద్రతలు లేనప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని వివరించారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారని, సీఎం ఎదురుగా దళిత సభ్యుడిపై దాడి జరిగినప్పుడు ప్రజలు చూస్తూ ఊరుకోరని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement