Wednesday, March 27, 2024

ధాన్యం కొనుగోళ్లకు పొంచి ఉన్న ‘ఆసని’ గండం.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ధాన్యం కొనుగోళ్లకు ఆసని తుఫాన్‌ గండం పొంచి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే ముమ్మరమవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ఏకంగా ఆసని తుఫాన్‌ కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు… అది మూడు రోజులపాటు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరించింది. గంటలకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. బుధవారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ రణశాఖ వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం అక్కడక్కడ పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు పది రోజుల క్రితం నుంచి ముమ్మరమయ్యాయి. ఈ ఏడాది 60లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనాలని అంచనా వేయగా ఇప్పటి వరకు దాదాపు 8లక్షల టన్నులు మాత్రమే కొనుగోళ్లు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 5లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఈజీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో మూడు రోజులపాటు ఆసని తుఫాన్‌ కారణంగా వర్షాలు కురువనున్నాయన్న వాతావరణశాఖ హెచ్చరికలు రైతుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలు ధాన్యం నిల్వలతో నిండిపోయాయి. కేంద్రానికి వచ్చిన ధాన్యం కొనుగోళ్లకు కనీ సం ఎంతలేదన్న వారం రోజుల సమయం పడుతోంది. ధాన్యాన్ని ఎండబెట్టి, తూర్పారబట్టి… తూకం అయ్యే వరకు నీరి క్షించాల్సి రావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన ఎండలు, వడగాలుల్లోనూ కొనుగోలు కేంద్రాల వద్దే ఎక్కువ సమయం గడపుతున్న రైతులకు ఆసని తుఫాన్‌ ప్రభావం కంటిమీద కునుకును కూడా దూరం చేసే పరిస్థితులు నెలకొన్నాయి.

తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ హుటాహుటిన టార్పలిన్‌ షీట్లను పలు జిల్లాలకు సమకూర్చుతోంది. రైతులు కూడా తమకు అందుబాటులో ఉన్న ఫ్లెక్సీలు, టార్పలిన్‌ షీట్లను ధాన్యం కుప్పలపై కప్పి ఉంచుతున్నారు. పలు చోట్ల కొనుగోలు కేంద్రాల వద్ద నేల ఎగుడుదిగుడుగా ఉండటం, కొన్ని చోట్ల వరికోసిన మడులలోనే కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తుండడంతో ఆసని తుఫాన్‌ విరుచుకుపడితే భారీ నష్టం తప్పదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement