Thursday, April 25, 2024

కాంగ్రెస్ ప్లీనరీకి ఏర్పాట్లు.. ముసాయిదా కమిటీ నియామకం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ 85వ ప్లీనరీ కోసం ఏర్పాట్లు వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో ప్లీనరీలో చర్చించే అంశాలను సిద్ధం చేయడం కోసం ఏఐసీసీ డ్రాఫ్టింగ్ కమిటీతో పాటు వివిధ సబ్ గ్రూపులను ఏర్పాటు చేసింది. ఈ నెల 24 నుంచి 26 వరకు చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం 21 మంది సభ్యులతో ముసాయుదా (డ్రాఫ్టింగ్) కమిటీతో పాటు రాజకీయ, ఆర్ధిక, అంతర్జాతీయ వ్యవహారాలు, రైతులు & వ్యవసాయం, సామాజిక న్యాయం & సాధికారత, యువత, విద్య & ఉద్యోగాలుగా విభజిస్తూ మొత్తం 6 సబ్ గ్రూపులను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. కమిటీ జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ పేరిట ఒక ప్రకటన రూపంలో విడుదల చేశారు.

ముసాయుదా (డ్రాఫ్టింగ్)  ఛైర్మన్‌గా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మీడియా వ్యవహారాల ఇంచార్జి జైరామ్ రమేశ్‌ను నియమించగా, కన్వీనర్‌గా పవన్ ఖేరాకు బాధ్యతలు అప్పగించారు. ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు రఘువీరారెడ్డి, కొప్పుల రాజుకు స్థానం లభించింది. ఉప బృందాల్లో తెలుగు రాష్టాలకు చెందిన పలువురు నాయకులకు స్థానం కల్పించారు. 20 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన రాజకీయ వ్యవహారాల సబ్ గ్రూపులో ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు కల్పించారు. ఈ గ్రూప్ ఛైర్మన్‌గా వీరప్ప మొయిలీ, కన్వీనర్‌గా అశోక్ చవాన్‌కు బాధ్యతలు అప్పగించారు. 14 మంది సభ్యులతో ఆర్ధిక వ్యవహారాలపై ఏర్పాటు చేసిన ఉప బృందంలో తెలుగు నేతలు సంజీవ రెడ్డి, జేడి శీలంకు చోటు దక్కింది. ఈ గ్రూప్ ఛైర్మన్‌గా మాజీ మంత్రి పి. చిదంబరం, కన్వీనర్‌గా ప్రొ. గౌరవ్ వల్లభ్ వ్యవహరించనున్నారు.

- Advertisement -

11 మంది సభ్యులతో అంతర్జాతీయ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన ఉప బృందంలో మాజీ మంత్రి ఎమ్.ఎమ్. పల్లంరాజు కు స్థానం కల్పించారు. ఈ ఉప బృందానికి చైర్మన్‌గా సల్మాన్ ఖుర్షీద్, కన్వీనర్‌గా శశి థరూర్ వ్యవహరించనున్నారు. రైతులు & వ్యవసాయంపై ఏర్పాటు చేసిన ఉప బృందానికి కన్వీనర్‌గా ఎన్. రఘువీరా రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ ఉప బృందానికి చైర్మన్‌గా భూపిందర్ సింగ్ హూడా వ్యవహరించనున్నారు. సామాజిక న్యాయం – సాధికారతపై ఏర్పాటు చేసిన ఉప బృందానికి కన్వీనర్‌గా కొప్పుల రాజుకు బాధ్యతలు అప్పగించగా, చైర్మన్‌గా ముకుల్ వాస్నిక్ వ్యవహరించనున్నారు. ఈ గ్రూపులో సభ్యులుగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు చోటు దక్కింది. చివరగా యువత, విద్య & ఉద్యోగాలపై ఏర్పాటు చేసిన ఉప బృందంలో జిగ్నేష్ మేవాని, కన్హయ్య కుమార్ లకు స్థానం కల్పించారు. ఈ బృందానికి ఛైర్మన్‌గా అమరీందర్ సింగ్ రాజా బ్రార్, కన్వీనర్‌గా ఎస్. జ్యోతిమణి వ్యవహరించనున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement