Sunday, March 24, 2024

నిర్మల్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటనకు ఏర్పాట్లు.. 4న సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ నెల 4న నిర్మల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఆరోజు ముందుగా నిర్మల్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని, తరువాత బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. దీంతో ఓ వైపు అధికార యంత్రాంగం, మరోవైపు పార్టీ కేడర్‌ చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు కార్యక్రమాలు ముగిసిన వెంటనే స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు. ఎల్లపల్లి శివారు క్రషర్‌ రోడ్‌ వద్ద ఈ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అక్కడి నుంచి మంత్రిమండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంద్రకరణ్‌రెడ్డి సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, సంబంధిత జిల్లా అధికారులతో కలిసి.. నూతన సమీకృత కలెక్టరేట్‌ సముదాయం, కొత్తగా నిర్మించిన బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని, బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని, హెలిప్యాడ్‌ను పరిశీలించారు.

లక్ష మందితో బహిరంగ సభ

- Advertisement -

నిర్మల్‌ జిల్లా కేంద్రంలో లక్ష మందితో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎల్లపల్లి గ్రామ శివారులోని క్రషర్‌ రోడ్‌లో అనువైన స్థలంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు- జరుగుతున్నాయి. గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రజలకు అందిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తారని ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సభకు వచ్చే ప్రజలు, ప్రజా ప్రతినిధుల కోసం అవసరమైన మేర పార్కింగ్‌ ఏర్పాటు, ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నం కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement