Thursday, April 25, 2024

ఆర్టీసీలో ఉద్యోగాలంటూ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌.. తప్పుడు ప్రచారమంటూ ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటన

అమరావతి, ఆంధ్రప్రభ: ఆర్టీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న పోస్టులపై సంస్థ యాజమాన్యం అప్రమత్తమైంది. ఆర్టీసీలో ఏ విధమైన ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదని స్పష్టం చేస్తూ ఈ తరహా మోసపూరిత ప్రకటనలకు నిరుద్యోగ యువత మోసపోవద్దని హితవు పలికింది. ‘ఏపీఎస్‌ ఆర్టీసీలో ఉద్యోగాల నోటిఫికేషన్‌-2023’ పేరిట సామాజిక(వాట్సప్‌) మాధ్యమాల్లో ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది. తొందరలోనే ఆర్టీసీలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంటూ ముందుగానే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందనే వార్త విస్తృత ప్రచారం కావడంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్టీసీలో ఏ విధమైన నోటిఫికేషన్లు జారీ చేయలేదని స్పష్టం చేశారు.

ఈ తరహా ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటూ మోసగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. గతంలో ఇదే తరహాలో కొందరు ఫేక్‌ మెయిల్స్‌ ద్వారా పలువురిని మోసగించినట్లు తెలిపారు. ఇప్పడు వాట్సప్‌ సందేశాలు పంపుతున్నట్లు పేర్కొంటూ అభ్యర్థులు ముందుగానే ఫీజు చెల్లించడం, ఆధార్‌ కార్డులు, బ్యాంకు ఓటీటీ తదితర వివరాలన్నీ అందులోనే తెలపాలని మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థలు అన్ని వివరాలు సేకరించి మోసాలకు పాల్పడే అవకాశం ఉందనే విషయం గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ అనేది పత్రికలు, మీడియా ద్వారా అధికారికంగా ప్రకటిస్తారని అధికారులు తెలిపారు. ఈ తరహా ప్రకటనల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement