Saturday, March 23, 2024

ఎగుమతుల్లో ఏపీ భారీ వృద్ధి.. ఆక్వా, వ్యవసాయోత్పత్తుల్లో పెరుగదల

అమరావతి, ఆంధ్రప్రభ: వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ భారీ వృద్ది నమోదు చేసింది. ఈ మేరకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల సంస్థ (ఎపెడా) నివేదిక వెల్లడించింది. ఉత్పత్తుల పరిమాణంలోనూ, విలువలోనూ గత ఏడాది (2021-22) తో పోలిస్తే 25 నుంచి 30 శాతానికి మించి వృద్ది నమోదు చేయవచ్చనీ, ఆర్ధిక సంవత్సరం ముగిసేలోపు కోటి లక్షల ఉత్పత్తుల ఎగుమతులకు చేరువ కావచ్చని అంచనా. 2020-21లో 52.88 లక్షల టన్నుల ఆహార ఎగుమమతులు వివిధ దేశాలకు ఏపీ నుంచి ఎగుమతయ్యాయి..వాటి విలువ రూ 13,781 కోట్లు కాగా 2021-22లో రూ.19,902 కోట్ల విలువైన రూ 79.33 లక్షల టన్నుల ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. ఈ ఏడాది (2022-23) గడిచిన అర్ధ సంవత్సరంలో రూ.9,782 కోట్ల విలువైన 35.90 లక్షల టన్నులు ఎగుమతయినట్టు ఎపెడా వెల్లడించింది.

పంటలకు ఏపీ బ్రాండింగ్‌ ఇవ్వటం, క్రాప్‌ సర్టిఫికేషన్‌ విభాగం ఏర్పాటు చేయటం, పొలం బడులు, గుడ్‌ అగ్రికల్చర్‌ ప్రాక్టీస్‌ (జీఏపీ) సర్టిఫికేట్ల మంజూరు కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకుని శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతున్న క్రమంలో రానున్న అయిదునెలల్లో ఆక్వా, వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు భారీగా పెరిగే అవకాశమున్నట్టు అంచనా. ఆక్వా రంగంలో ఏర్పడిన సంక్షౌభం కొద్ది రోజుల్లో సమిసిపోతే ఎగుమతుల విలువలో అనూహ్య పెరుగుదల కనిపించవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈ ఏడాది గడిచిన ఆరునెలల్లో ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల పరిమాణం ఏమాత్రం తగ్గలేదు. 2021-22లో 3,24,008 టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి కాగా ఈ ఏడాది (2022-23)లో గడిచిన ఆరు నెలల్లో 2,16,879 టన్నుల ఎగుమతి నమోదయింది. గత ఏడాది ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ 20,020 కోట్లుగా ఉండగా ఈ ఏడాది ఇప్పటివరకు అంచనా విలువ సుమారు రూ.14 వేల కోట్లుగా ఉంది. దేశవ్యాపిత ఆక్వా ఎగుమతుల్లో ఏపీ వాటా చెరువుల్లో పెరిగే రొయ్యల్లో 67 శాతం, సముద్ర ఉత్పత్తుల్లో 36 శాతం నమోదయినట్టు ఎపెడా వెల్లడించింది.

- Advertisement -

ఆహారోత్పత్తుల్లోనూ వృద్ధి

గత ఏడాది రూ 19,902 కోట్ల విలువైన 79,32,915 టన్నుల ఆహార ఉత్పత్తులు ఎగుమతి కాగా ఈ ఏడాది ఇప్పటివరకు రూ.9,782 కోట్ల విలువైన 35,89,721 టన్నులు ఎగుమతయ్యాయి. ఏపీ నుంచి ప్రధానంగా బియ్యం, అపరాలు, మొక్కజొన్న, జీడిపప్పు, ప్రాసెసింగ్‌ చేసిన పండ్లు, పండ్ల రసాలు, కూరగాయలు ఎగుమవతువుతున్నట్టు ఎపెడా వెల్లడించింది. వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల్లో అత్యధిక వాటా నాన్‌ బాస్మతీగా పిలిచే వివిధ బియ్యం వెరైటీలు ఉన్నాయి. ఏపీ నుంచి నాన్‌ బాస్మతీ బియ్యం ఈ ఏడాది దక్షిణాసియా, మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు ఎగుమతి కాగా..గత ఏడాది అమెరికా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, అరబ్‌ దేశాలకు ఎగుమతయినట్టు ఎపెడా నివేదికలో పొందుపర్చింది.

జీఏపీతో పెరగనున్న ఎగుమతులు

ఏపీ నుంచి విదేశీ ఎగుమతులను పెంపుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. సేంద్రీయ, సేంద్రీయేతర పంటల సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులు అవలంబిస్తున్న రైతులకు ప్రభుత్వం గుడ్‌ అగ్రికల్చరల్‌ ప్రాక్టీస్‌ (జీఏపీ) సర్టిఫికేషన్‌ ఇవ్వనుంది. పంట నాణ్యతకు సంబంధించి ప్రభుత్వమే హామీగా ఉండటం వల్ల ఆయా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఎంఓయులు కూడా పెరుగుతాయని అంచనా. సాగు దశలో జీఏపీ అందుకున్న రైతులు పండించిన పంటల నమూనాలను అగ్రిల్యాబుల్లో పరీక్షించిన తరువాత క్రాప్‌ సర్టిఫికేషన్‌ ఏజెన్సీ ధృవీకరణ పత్రాలు జారీ చేయనుంది.

ప్రైవేట్‌ సంస్థల ప్రమేయం లేకుండా ప్రభుత్వం తరపున ధృవీకరణ పత్రాలు జారీ చేయటం వల్ల దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ రైతులు పండించే పంటల ఎగుమతుల్లో ఎదురవుతున్న ఇబ్బందులన్నిటినీ అధిగమించవచ్చని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు భారీగా పెరుగుతాయని అంచనా. ఇంటర్నేషనల్‌ కాంపిటెన్స్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ తాజా నివేదిక ప్రకారం ఏపీ నుంచి ఏటా సుమారు రూ.130 కోట్ల విలువైన వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు అవుతున్నాయి. ప్రభుత్వం జారీ చేసే క్రాప్‌ సర్టిఫికేట్లు జారీ అయిన తరువాత ఎగుమతులు భారీ స్థాయిలో పెరగవచ్చని అంచనా. జీఏపీ ఉత్పత్తులకు యూరప్‌ దేశాల నుంచి అత్యధిక డిమాండ్‌ ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement