Friday, April 19, 2024

ఫాక్స్‌కాన్‌కు యాపిల్‌ ఎయిర్‌పాడ్ల కాంట్రాక్ట్‌.. తెలంగాణలో తయారీ కేంద్రం

యాపిల్‌ ఎయిర్‌పాడ్ల తయారీ కాంట్రాక్టును ఫాక్స్‌కాన్‌ దక్కించుకుంది. ఐఫోన్లు సహా మరికొన్ని సెమీ కండక్టర్లను మాత్రమే ఇప్పటి వరకు అందిస్తున్న ఈ సంస్థ ఇకపై ఎయిర్‌పాడ్లు కూడా తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఎయిర్‌పాడ్లను చైనాకు చెందిన కంపెనీలు యాపిల్‌కు సరఫరా చేస్తున్నాయి. అయితే, చైనా నుంచి తయారీని ఇతర దేశాలకూ విస్తరించాలనే ప్రణాళికలో భాగంగానే తాజాగా ఫాక్స్‌కాన్‌కు ఈ ఒప్పందాన్ని కట్టబెట్టారని సమాచారం. మరోవైపు భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ఫాక్స్‌కాన్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

సంస్థ సీఈవో యాంగ్‌ లియూ ఇటీవల భారత్‌లో పర్యటించి ఆ విషయాన్ని ధ్రువీకరించారు. పర్యటనలో భాగంగా తెలంగాణానూ సందర్శించిన ఆయన ఇక్కడ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అందుకోసం 200 మిలియన్‌ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్లొచ్చని భావిస్తున్నారు. అయితే, దీనిపై ఫాక్స్‌కాన్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనుబంధ సంస్థ ఫాక్స్‌కాన్‌ ఇంటర్‌కనెక్ట్‌ టెక్నాలజీ ద్వారా ఫాక్స్‌కాన్‌ తెలంగాణలో ప్లాంట్‌ నెలకొల్పే అవకాశం ఉందని కంపెనీ లోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలోనే నిర్మాణ పనులు ప్రారంభం కావొచ్చని తెలసుస్తోంది.

2024 ఆఖరు కల్లా తయారీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. యాపిల్‌ సూచన మేరకే ఫాక్స్‌కాన్‌ భారత్‌లో ఎయిర్‌పాడ్లను తయారు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా పూర్తి వివరాలు కంపెనీ నుంచి రావల్సి ఉంది. తెలంగాణలో తయారీ కేంద్రం ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నట్లు ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ యాంగ్‌ లియూ ఇటీవల స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ నెల రెండో తేదిన సమావేశంలో చెప్పినట్టుగా రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో తయారీ కేంద్రం ఏర్పాటుకు ఫాక్స్‌కాన్‌ కట్టుబడి ఉందని లేఖలో స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement