Friday, April 19, 2024

21న అప్పన్న తెప్పోత్సవం.. వేణుగోపాల స్వామి అలంకరణలో సింహాద్రినాధుడు

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రేపు (శనివారం) సాయంత్రం సింహాద్రినాధుడు తెప్పోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతీ ఏటా పుష్య బహుళ అమావాస్యనాడు సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా జరిపించేందుకు ఆలయ ఇన్‌ఛార్జి ఇవో వి.త్రినాధరావు ఆద్వర్యంలో ఆలయ వర్గాలు విశేషంగా ఏర్పాట్లు చేశారు. ఉత్సవంలో భాగంగా శనివారం సాయంత్రం సింహాద్రినాధుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను సర్వాభరణాలుతో అందంగా అలంకరించి వేద మంత్రోశ్చరణలు, మృదుమధుర మంగళవాయిద్యాల నడుమ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పల్లకిలో ఆశీనులను చేసి మెట్ల మార్గం ద్వారా బోయిలు కొండ దిగువకు తీసుకువస్తారు.

- Advertisement -

అక్కడ ఆలయ తొలిపావంచ వద్ద గ్రామపెద్దలు, ఆలయ అధికారులు దర్మకర్తల మండలి సభ్యులు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి గ్రామంలోకి సాదర స్వాగతం పలకనున్నారు. అక్కడ నుంచి స్వామి నేరుగా వరాహపుష్కరణికి చేరుకొని అక్కడ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన హంసవాహనంపై ఆశీనులు కానున్నారు. స్వామి, అమ్మవార్లు వరాహ పుష్కరణి మధ్యన ఉన్న కళ్యాణ మండపం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయనున్నారు. హంసవాహనంపై విహరించి భక్తులకు తమ దర్శనంతో కనువిందు చేయనున్నారు. తదుపరి కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజలు అనంతరం తిరిగి పుష్కరణి స త్రంకి చేరుకుంటారు. అక్కడ ఉయ్యాల సేవ జరిపిన అనంతరం గ్రామ తిరువీధి నిర్వహిస్తారు.

ఉత్సవం పూర్తి కాగానే తిరిగి మెట్ల మార్గం ద్వారా స్వామి నేరుగా సింహగిరికి చేరుకుంటారు. ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఆలయ వర్గాలు ఇప్పటికే పూర్తి చేశాయి. సింహాద్రినాధుడి ఉత్సవ మూర్తి ప్రతినిధిగా గోవిందరాజు స్వామి అమ్మవార్లతో కలిసి హంసవాహనంపై విహరించడం, ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు సింహాచలం పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రావడం సాంప్రదాయబద్ధంగా వస్తుంది. ఇక నుంచి స్థానిక గ్రామాల్లో పరసలు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement