Monday, October 14, 2024

AP: అప్పన్న ప్రసాదాలు తనిఖీ చేసిన గంటా..

నెయ్యి తక్కువకి కొనుగోలు చేయడం పై అరా
నాణ్యత చూసుకోవాలి కదా అంటూ అసహనం
భోజనం బాగుంది అంటూ ప్రశంస‌
విశాఖపట్నం, ఆంధ్ర ప్రభ బ్యూరో : తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసిందని ఆరోపణల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు తన నియోజకవర్గం పరిధిలోని సింహాచలం దేవస్థానంలో లడ్డూ తయారీ సెంట్రల్ స్టోర్, ప్రసాదాలను శనివారం తనిఖీ చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో దేవస్థానానికి కొనుగోలు చేసిన సరుకుల వివరాలు, రికార్డులను పరిశీలించారు. టెండర్ల ప్రక్రియను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

నెయ్యి కొనుగోలుపై రికార్డులను పరిశీలించారు. గుమాస్తాలు ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు దేవస్ధానం అధికారులు సమాధానాలు చెప్పారు. కిలో నెయ్యి 385 రూపాయలుకు కొనుగోలు చేయడంపై ఎమ్మెల్యే ఆశ్చర్యం, అనుమానం వ్యక్తం చేశారు. ఇంత తక్కువ ధరకు ఎలా కొనుగోలు చేశారంటూ ప్రశ్నించారు. గతంలో పంపిణీ చేసిన విశాఖ డైరీ నెయ్యిని ఎందుకు నిలిపివేశారంటూ నిలదీశారు. మార్కెట్ లో కిలో నెయ్యి ధర కనీసం ఆరు వందలుంటే ఇంత తక్కువ ధరకు ఎలా కొన్నారని ప్రశ్నించారు. ధర తగ్గితే చాలా..! నాణ్యత, కొలతలు చూసుకోవలసిన అవసరం లేదా ? అంటూ నిలదీశారు.

మీరెప్పుడైనా దేవస్థానానికి వచ్చి సరుకులు తనిఖీ చేశారా అంటూ ఆహార భద్రత శాఖ అధికారులను ప్రశ్నించారు. నాణ్యత ప్రమాణాలకు సంబంధించి తీసుకున్న పత్రాలను దేవస్ధానం సిబ్బంది చూపించే ప్రయత్నం చెయ్యగా ఎమ్మెల్యే తోసిపుచ్చారు. సర్టిఫికెట్లు ఎలా వస్తాయో ఎవరికి తెలియదు ! అంటూ అసహనం వ్యక్తం చేశారు. రిజిష్టర్ కి అనుగుణంగా నెయ్యి స్టాక్ కి లెక్కించి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు.

- Advertisement -

నెయ్యితో పాటు కొన్ని సరుకులను తూకం వేయించి బరువును తనిఖీ చేసారు. అన్నింటి శాంపిల్స్ ను టెస్టుకు పంపించారు. వంటశాలకు వెళ్లి లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీని పరిశీలించారు. లడ్డూ నెయ్యి వాసన రావడం లేదన్నారు. లడ్డూ, పులిహోర రుచిచూశారు. అన్నదానంలో భోజనం చేసి రుచి బాగుండంటూ మెచ్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement