Friday, April 19, 2024

అధ్యక్షుడిలా కాదు, సమన్వయకర్తలా పని చేస్తా.. ఖర్గేను కలిసిన ఏపీసీసీ చీఫ్‌ రుద్రరాజు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కాకుండా సమన్వయకర్తలా పని చేస్తానని ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. ఏపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన ఆయన మంగళవారం వర్కింగ్ ప్రెసిడెంట్లతో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కలిశారు. ఆయనతో పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడారు.

తమది యంగ్ టీమ్ అన్న ఆయన, పార్టీ బలోపేతం కోసం పని చేస్తామని చెప్పారు. టీం స్పిరిట్‌తో ముందుకెళ్తామని, కొత్త వారిని తమ టీంలోకి తీసుకుంటామని అన్నారు. ఖర్గే తమకు చాలా పెద్ద టాస్క్ అప్పగించారని, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారని రుద్రరాజు వివరించారు. అందరినీ తమ సమన్వయం చేయడమే తన బాధ్యతని నొక్కి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోని అన్ని వ్యవస్థలను బలోపేతం చేస్తానని గిడుగు రుద్రరాజు ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement