Monday, October 14, 2024

AP – చెత్త ప‌న్నుకు చెల్లుచీటీ! మార్చిలోగా బందరు పోర్టు పూర్తి చేస్తాం: చంద్రబాబు

గ‌తంలో ఉన్న‌ది చెత్త ప్రభుత్వం
సాలిడ్ వేస్ట్ కేంద్రాలకు రంగేశారు
85 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది
ఇక చెత్త పన్నులు వసూలు చేయొద్దు
కేబినేట్‌లో నిర్ణయం తీసుకుంటాం
మార్చిలోగా బందరు పోర్టు పూర్తి చేస్తాం
నేషనల్ కాలేజీని దత్తత తీసుకుంటాం
ఇక‌మీద‌ట పింగళి వెంకయ్య మెడికల్ కాలేజీగా మారుస్తాం
మ‌చిలీప‌ట్నం స్వ‌చ్ఛ‌తా హి సేవా కార్య‌క్ర‌మంలో సీఎం

ఆంధ్రప్రభ స్మార్ట్, మచిలీపట్నం : ఏపీలో చెత్త పన్నుపై ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చెత్త పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. చెత్త మీద పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నాం.. వచ్చే కేబినెట్ భేటీలో ఈ అంశాన్ని పెట్టి ఆదేశాలిస్తాం.. అధికారులు కూడా చెత్త పన్నును ఇకపై వసూలు చేయవద్దు అంటూ సీఎం చంద్ర‌బాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బుధవారం మచిలీపట్నంలో జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా స్వచ్చత హి సేవా ప్రజావేదిక సభలో ప్రకటించారు.

- Advertisement -

ఈ సభలో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. మీ ఊరు వస్తుంటే, ఎక్కడబడితే అక్కడ చెత్త కుప్పలు, కుప్పలుగా.. చెత్త అడవులుగా పెరిగాయన్నారు. 2.43, 612 మరుగుదొడ్లు నిర్మించామని, 8124 సామూహిక టాయిలెట్నిర్మించి 110 మున్సిపాలిటీలను ఏడీఎఫ్ మార్చామన్నారు. ఎన్నికల ముందే అది చెత్త ప్రభుత్వమని చెప్పామని, ఏపీ మొత్తంలో 85 లక్షల టన్నుల చెత్త గుట్టలు గుట్టలుగా మారిపోయిందన్నారు. గత ప్రభుత్వం పేర్చిన 85 లక్షల టన్నుల చెత్త పేరుకు పోయిందని, ఈ చెత్త మీద పన్ను వేశారని, పన్ను చెల్లించక పోతే చెత్త మీద పన్ను వేసి షాపులు మీద పడవేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త మీద పన్ను వేయటానికి వీలు లేదు. ఎక్కడా వసూలు చేయటానికి వీల్లేదు, ఈ రోజు నుంచే చెత్త పన్నును రద్దు చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

సాలిడ్ వేస్ట్ కేంద్రాలకు రంగేశారు

గ్రామ పంచాయతీల్లో 41,500 మరుగుదొడ్డు కట్టాం , 9, 838 సాలిడ్ వేస్టు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ చెత్తను తీసుకు పోవడం మానేసి, షెడ్లకు సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల ముఖానికి వేసి ఊరంతా తిప్పితే బుద్ది వచ్చేదని విరుచుకుపడ్డారు. ఉదాత్తమైన మనసుతో షెడ్‌లు పెడితే… కేంద్రం డబ్బులు ఇచ్చింది. వాటిని కూడా ఇష్టం వచ్చినట్లు చేసి నిధులు లేకుండా చేశారు. కరెంటు ఉత్పత్తి చేసే ప్లాంట్లు రెండు మాత్రం పని చేస్తున్నాయి. మిగతా అన్ని ఫ్లాంట్లు పనికి రాకుండా చేశారు. రోడ్ల మీద చెత్త ఉండేందుకు వీలు లేదు.. ఎన్ని ఫ్లాంట్లు అయినా పెడతాం. చెత్త నుంచి కరెంటు తయారీ ప్లాంట్లను పునరుద్ధరిస్తాం. ప్రతిఒక్కరూ స్వచ్చ సేవకులు కావాలి.. స్వచ్చ ఆంధ్రప్రదేశ్ సాధించాలి. గాంధీ జయంతిన 2029 కి ఏపీ స్వచ్చ ఆంధ్రప్రదేశ్‌గా తయారు కావాలని మనం సంకల్పం చేయాలి’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు..

హిందూ జాతీయ కళాశాలను దత్తత తీసుకుని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ముట్నూరి కృష్ణారావు, జెండా కర్ర తోట నరసయ్య, బోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి వారు ఈ ప్రాంతం నుంచి వచ్చారని, మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు పెడతామని హామీ ఇచ్చారు. 2025 మార్చి లోపు బందరు పోర్టును ప్రారంభిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటికే పోర్టు పని పూర్తయ్యేదని, ఆ పనులను కూడా దెబ్బతీశారని గత పాలకులను విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement