అమరావతి, ఆంధ్రప్రభ : ఆయిల్‌పామ్ సాగులో ఏపీ దూసుకువెళుతోంది. సాగు, దిగుబడి, విస్తరణలో దేశంలోనే ప్రథమస్థానంలో నిలుస్తోంది. విజయవాడ సమీపంలోని పోరంకిలో నిర్వహిస్తున్న ఆయిల్ పామ్ జాతీయ సదస్సులో ఏపీకి బెస్ట్ పెర్మార్మెన్స్ ఇన్ ఇండియా అవార్డు దక్కింది భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మాజీ డిప్యూటీ డైరెక్టర్ హెచ్.పీ సింగ్, మలేషియా ఆయిల్ పామ్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ పర్వేజ్ ఖాదీర్ తదితరులు జాతీయ సదస్సులో పాల్గొని ఏపీలో ఆయిల్ పామ్ కు ఉన్న అపార అవకాశాల గురించి రైతులతో పాటు ప్రాసెసింగ్ యూనిట్లు నిర్వాహకులు, ఇతర వాణిజ్యవేత్తలకు తెలియచెప్పారు. అధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 4 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగవుతుంటే ఏపీ సాగు విస్తర్ణం 1.9 లక్షల హెక్టార్లుగా ఉంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చెందే అవకాశం ఉందని గుర్తించగా.. అందులో ఏపీ వాటా 40 శాతం మేర ఉండవచ్చని అంచనా. రాష్ట్రంలోని 12 ఇండస్ట్రియ్రల్ జోన్లలో గంటకు 460 టన్నులను ప్రాసెసింగ్ చేసే యూనిట్లు ఉండటం ఆయిల్ పామ్ హబ్ గా ఏపీగా ఎదుగుతుందనటానికి సంకేతమని అధికారులు చెబుతున్నారు.
తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగుకు అనువైన వాతావరణం ఉందని గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయిల్ పామ్ మిషన్ ఏపీలో సాగు విస్తరణకు ఊతమిస్తోంది. ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహకాల కింద ఆయిల్ పామ్ మిషన్‌ను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తొలివిడతగా 104 కోట్ల రూపాయలను కేటాయించింది. ఆయిల్ పామ్ సాగులో ఎకరాకు సగటున 10 టన్నుల దిగుబడి వస్తుండగా ఇపుడున్న ధరల ప్రకారం రూ.2 లక్షల మేర లాభం వస్తున్నట్టు అంచనా. గత ఏడాది నవంబరులో మార్కెట్ సీజన్ ప్రారంభం కాగా ఫిబ్రవరి నుంచి ధరలు క్రమేపీ పెరుగుతూ టన్ను రూ.16 వేల నుంచి 23 వేలకు చేరింది. రాష్ట్రంలో సుమారు 1.9 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగవుతోంది. గత ఏడాది 2021-22లో 17.22 లక్షల టన్నులు రాగా.. ఈ ఏడాది 2022-23లో 21 లక్షల టన్నులు రావచ్చని అంచనా. ఈ మేరకు ప్రాసెసింగ్ యూనిట్లను కూడా పెంచేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం గంటకు సుమారు 460 టన్నుల సామర్దంతో ఆయిల్ తీసే 13 పామాయిల్ పామాయిల్ కంపెనీలున్నాయి. పామాయిల్ సాగు ఎక్కువగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో మరిన్ని ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పేందుకు పామాయిల్ కంపెనీలు ఉత్సాహం చూపిస్తున్నాయి.
రైతులకు భారీ సబ్సిడీ
కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణ, దిగుబడి పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రైతులకు ప్రోత్సాహకాలు అందించేందుకు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (ఎన్.ఐ.ఎం.ఈ.వో-ఓపీ) పేరుతో దేశీయ మిషన్ ను ప్రకటించింది. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ 80 కోట్లతో ధరల కోసం స్థిరీకరణ నిధిని ఏర్పాటు- చేసింది. ఆయిల్ పామ్ సాగుకు అవసరమైన వేప చెక్క, ఇతర సేంద్రీయ ఎరువులను రైతు భరోసా కేంద్రాల కియోస్క్ బుకింగ్ ల ద్వారా సరఫరా చేయటం, ఆయిల్ ఫామ్ ఫార్మ్ గేటు-కు సమీపంలో ప్రాసెసింగ్ యూనిట్లు- నెలకొల్పటం, రైతులకు అవసరమైన మొక్కలను సరఫరా చేయటం, సన్న, చిన్న కారు రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు దృష్టి మరల్చేలా ప్రోత్సాహకాలు పెంపొందించటం తదితర ప్రతిపాదనల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆయిల్ పామ్ ను జాతీయ వంట నూనెల మిషన్ (ఎన్‌ఎంఈవో)లో చేర్చటం ద్వారా భారీ రాయితీలు ప్రకటించింది.
ఉద్యానవనశాఖ నుంచి రైతులకు అందించే ప్రతి ఆయిల్ పామ్ మొక్కపై 85 శాతం సబ్సిడీని ప్రకటించింది. సబ్సిడీని జాతీయ ఆహార భద్రత మిషన్ నుంచి రైతులకు నేరుగా అందిస్తోంది. సాగుకు అవసరమైన వర్మీ కంపోస్ట్ యూనిట్లు, పంపు సెట్లు, గొట్టపు బావులతో పాటు ఇతర యంత్రాలు, పరికరాల కొనుగోలు కోసం 50 శాతం సబ్సిడీ అందిస్తోంది. అయిల్ పామ్ సాగుకు అనుబంధంగా అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పటం, డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సాహకాలు, పంట ధరలను హేతుబద్ధంగా నిర్ణయించేందుకు ఆయిల్ ఎక్ట్రాక్స్రన్ రేషియో (ఓఇఆర్) ను అనుసరించటం, ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా నష్టపోకుండా నష్ట నివారణ నిధి (వయబులిటీ గ్యాప్ ఫండింగ్) ఏర్పాటు చేయటంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.