Friday, March 24, 2023

కృష్ణా జలాలకు గండి కొడుతున్న ఏపీ.. స్పందించని కేఆర్‌ఎంబీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: శ్రీశైలం నుంచి కృష్ణా జలాలకు గండి కొడుతున్న ఏపీ పై న్యాయపోరాటానికి తెలంగాణ నీటిపారుదల శాఖ సిద్ధమవుతుంది. కృష్ణానదీయాజమాన్యం సంస్థకు ఎన్ని లేఖలు రాసినా స్పందన లేకపోవడంపట్ల రాష్ట్ర నీటిపారుదల శాఖ విచారం వ్యక్తం చేస్తుంది. గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగుగంగ ప్రాజెక్టుల విస్తరణకు అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం పనులు చేపట్టడాన్ని తప్పుబడుతూ ఇప్పటికే ఈఎన్సీ మురళీధర్‌ రావు కేఆర్‌ఎంబీ కి లేఖలు రాసినా స్పందించకపోవడంతో గాలేరు – నగరి సృజల శ్రవంతి ప్రాజెక్టులను విస్తరిస్తూ శ్రీశైలం జలాశయం నీటిని పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు ద్వారా తరలించేందుకు ఏపీ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఇప్పటికే టెండర్లను పూర్తి చేసి పనులు శరవేగంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపణలు మరోసారి తెరమీదకు వచ్చాయి.

కృష్ణా నదీ యాజమాన్యం సంస్థ అనుమతులు లేకుండానే గాలేరు- నగరి సుజల స్రవంతి ప్యాకేజీ -2 మట్టి పనులతో పాటుగా వావికొండసాగర్‌ జలాశయం, నరెడ్డి శివరామిరెడ్డి (సర్వరాయ సాగర్‌) జలాశయాల కట్టలను బలోపేతం చేసేపనులు, కాలువలు, డిస్ట్రి బ్యూటరీల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం టెండర్లను ఖరారచేసిందని తెలంగాణ ఇప్పటికే ఫిర్యాదులు చేసింది. రూ.130 కోట్ల నిధులు కేటాయించి ఏపీ పనుల్లో వేగం పెంచింది. అయితే ఎస్‌ ఆర్‌ఎంసి క్యాస్‌ రెగ్యులేటర్‌, బనకచర్ల,పోతిరెడ్డి పాడుహెడ్‌ రెగ్యురేటర్‌ ల ద్వారా 34 టీఎంసీ నీటిని తీసకునేందుకు అనుమతి ఉంది. వీటిలో 19 టీఎంసీ లు ఎస్‌ర్‌ఎంసి, 15 టిఎంసీలు చెన్నై నగరతాగునీరు అవసరాలకు ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే కృష్ణా పరివాహక ప్రాంతంలోనే నీటిని వివియోగించుకోవాలని కెడిడబ్ల్యూడిటి-1 సూచించింది.

- Advertisement -
   

ఏపీ ప్రభుత్వం దీనికి విరుద్ధంగా కృ ష్ణా జలాలను తరలించేందుకు పటిష్టమైన ప్రణాళికను రూపొందించి అమలుచేస్తుంది. పోతిరెడ్డి పాడుద్వారా 1500 క్యూసెక్కులు తరలించాల్సి ఉండగా సామర్థ్యం పెంచి 2006లో 44 వేల క్యూసెక్కులు, ప్రస్తుతం 88 వే క్యూసెక్కులను విస్తరించే పనులు చేపట్టారు. అలాగే బనక చర్ల దగ్గర గాలేరు-నగరి కి 22 క్యూసెక్కులు తరలించేందుకు వీలుగా అదనపు రెగ్యులేటర్‌ నిర్మించారు. ఈ విస్తరణకు కెడిడబ్ల్యూడిటి -2 అనుమతి లేదు. సెక్షన్‌ 89 మేరకు నీటికోసం ఏపీ దరఖాస్తు చేసుకోలేదు.

ఏపీ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టుల విస్తరణ కోసం రూ. 11వేల 908 కోట్ల రూపాయలు కేటాయించి ఆక్షేపణ ఉన్న పనుల్లో వేగం పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు నీటిపారుదల నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా తెలుగుగంగ ప్రధాన ప్రాజెక్టు కాలువపై రెండు ఎత్తి పోతల నిర్మాణాలను ఏపీ చేపడుతుంది. ప్రధాన కాలువ 120 .95 కిలో మీటర్ల దగ్గర మైదుకూరు మండలంలోని ముదిరెడ్డి పల్లి చెరువు నింపేందుకు వీలుగా నీటిని తరలించేందుకు పనులు చేపట్టారు. తెలుగు గంగ ప్రధాన కాలువ 120-92 కిలోమీటర్ల దగ్గర తిప్పిరెడ్డి పల్లి చెరువు (గోటేరు చెరువు ) నింపే పనుల్లో ఏపీ నిమగ్నమైంది. రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకంగా ఏపీ జలవిధానం ముందుకు సాగుతుంది. ఇప్పటికే కృష్ణా జలాల వాటలో తెలంగాణకు అన్యాయం జరిగింది. కేవలం 299 టీఎంసీ నీటితోనే ప్రాజెక్టులను నింపుకునే అవకాశాలున్నాయి.

వరదనీటికోసం కొత్త గా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆదిలోనే ఏపీ అక్షేపించడంతో పనులు నిలిచిపోయాయి. ఒకవైపు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ మరోవైపు శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను గండి కొట్టి కృష్ణా పరివాహక ప్రాంతం అవతలకు తరలించేందుకు ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టడంతోపాటుగా అవసరమైన నిధులను కూడా 2023-24 బడ్జెట్‌ లో కేటాయించడం తో తెలంగాణ నీటి పారుదల శాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఆయకట్టుకు, కరువు- ప్లోరైడ్‌ ప్రాంతాలకు, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని తెలంగాణలో ఆందోళన వ్యక్తం అవుతుంది. అపెక్స్‌ కౌన్సిల్‌ తక్షణం స్పందించి నిర్ణయం తీసుకోకపోతే శ్రీశైలం నుంచి ఏపీ నీటి తరలింపు వివాదాలను ప్రేరేపించి న్యాయపోరాటానికి నాంది పలికే అవకాశాలున్నట్లు జలనిపుణులుఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement