Friday, October 4, 2024

AP – ఉపాధి లేదు … ఉద్యోగాల్లేవు .. ఇది కూడా ముంచే ప్రభుత్వమే: షర్మిల

మంచి ప్రభుత్వం అస్స‌లే కాదు
సూపర్ సిక్స్ అమలు ఇంకెప్పుడు
అప్పుల సంగతి మీకు ముందే తెలుసు
ఇప్పుడు డబ్బులు లేవని తప్పించుకోవద్దు
గత ప్రభుత్వం కూడా ఇట్లానే ముంచింది
మంచి చేస్తారని మిమ్మల్ని జ‌నం నమ్మారు
కూటమి ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోతోంది
తాలి బజావ్ కార్య‌క్ర‌మంలో పీసీపీ చీఫ్ షర్మిల ఆగ్ర‌హం

ఆంధ్రప్రభ స్మార్ట్, ఎన్డీఆర్ జిల్లా బ్యూరో :
ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం, సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారు ? ఒక శ్వేత పత్రం విడుదల చేయండి అని సీఎం చంద్రబాబును ఏపీ పీసీసీ అధినేత్రి షర్మిల డిమాండ్ చేశారు. విజయవాడలో పళ్లెం, గంటెతో తాలి బజావ్ నిరసన కార్యక్రమాన్ని బుధ‌వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో మాట్లాడుతూ.. ఇది మంచి ప్రభుత్వమట.. ఊరూరా ప్రచారం చేసుస్తున్నారు, ఇది ఎట్లా మంచి ప్రభుత్వం అవుతుందో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

- Advertisement -

ఆ హామీల‌న్నీ ఏవీ..

సూపర్ సిక్స్ లో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు, ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు అన్నమాట, – ఈ 100 రోజుల ప్రణాళికలో ఉద్యోగాల కల్పన మీద మీ ప్లాన్స్ ఏవీ అన్నారు. 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, – వీటిని ఎలా నింపుతారో ప్రణాళికలు లేవు అని షర్మిల అన్నారు. ఈ ఏడాది అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని, 20 వేలు ఇస్తామన్న హామీ అటకెక్కినట్టు ఉందన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలకు 7 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లితే సీఎం చంద్రబాబు కేవలం 2 లక్షల ఎకరాలకు పరిహారం ఇస్తున్నారని, పరిహారం మీద కోత పెట్టిన ప్రభుత్వం ముంచే ప్రభుత్వం కాదా ? అని షక్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల కష్టాలు కనిపించడం లేదా ? వరదలో సర్వం కోల్పోతే కేవలం 4 లక్షల మందికే పరిహారం ఇస్తారా ? ఇదే ముంచే ప్రభుత్వం కాకపోతే మరేంటి ? అని షర్మిల అన్నారు.

ప్రధాని మోదీకి ఏపీపై చిన్న చూపు

ప్రధాని మోదీకి ఏపీపై చిన్నచూపు ఉందని, ఇక్కడ వరదల్లో సర్వం కోల్పోతే రైల్ నీర్ కూడా ఇవ్వలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా మోదీకి రాష్ట్రం మీద ఉన్న ప్రేమ ? రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీతో ఎందుకు కూటమి కట్టారో బాబు సమాధానం చెప్పాల‌ని ష‌ర్మిల అన్నారు. తల్లికి వందనం పథకం అమలు లేదు.. ఎంతమంది బిడ్డలు అంటే అందరికీ 15 వేలు ఇస్తాం అన్నారు.. గత ప్రభుత్వం ఒక బిడ్డకు ఇచ్చారు. ఈ ప్రభుత్వం కనీసం ఒక్క బిడ్డకు కూడా ఇవ్వలేదని విమ‌ర్శ‌లు గుప్పించారు. గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టే… ఈ ప్రభుత్వాన్ని గద్దెను ఎక్కించారు. ఈ ప్రభుత్వం కూడా ముంచే ప్రభుత్వం అని ప్రజలు భావస్తున్నారు.

మ‌హిళా ప‌థ‌కాలు ఎప్పుడు

ఆ పథకం కింద ఇచ్చే 15 వందలు ఎక్కడ ? కోటి మంది మహిళలకు ఎప్పుడు పథకం వర్తింప జేస్తారని ష‌ర్మిల‌ ప్రశ్నించారు. మనది రాజధాని లేని రాష్ట్రమే కాదు… బడ్జెట్ లేని రాష్ట్రం కూడా ఉంద‌ని విమ‌ర్శించారు. 100 రోజుల్లో బడ్జెట్ పెట్టే ధైర్యం లేదు.. ఏ పథకానికి ఎంత బడ్జెట్ చెప్పే ధైర్యం లేదు, అని మండిప‌డ్డారు. కనీసం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ధైర్యం కూడా చేయడం లేదు. గతంలో జగన్ సర్కార్ విశ్వసనీయత కోల్పోయింది, ఇప్పుడు బాబు సర్కార్ మీద కూడా జనాలు నమ్మకం కోల్పోతున్నారని షర్మిల అన్నారు. ఎన్నికలకు ముందే రాష్ట్రంలో 11 లక్షల కోట్లు అప్పులు అని మీకు తెలుసు.. మీరు మంచి చేస్తారని ప్రజలు ఓటేశారు, కానీ ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవటం మంచిది కాద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement