Thursday, April 25, 2024

ఢిల్లీలో ఘనంగా ఏపీ అవతరణ దినోత్సవం..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందరం పాటుపడాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఏపీ అవతరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రాంగణంలో అవతరణ దినోత్సవాలను మంగళవారం రెండు విడతలుగా నిర్వహించారు. భవన్ స్పెషల్ కమిషనర్ ఎన్.వి రమణారెడ్డి, అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ ఉదయ జాతీయ జెండా ఆవిష్కరణ చేసి సైనిక వందనం స్వీకరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు. ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ క్యాంపులో పలువురు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

ఢిల్లీలోని వివిధ హాస్పిటల్స్ నుంచి వచ్చిన వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది. సాయంత్రం అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకల్లో రమణారెడ్డి, హిమాన్షు కౌశిక్‌తో పాటు ఎంపీ అయోధ్య రామిరెడ్డి పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆంధ్రరాష్ట్రం కోసం ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ఢిల్లీలో నివసిస్తున్న తెలుగు వారు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రాంగణం విద్యుద్దీపాలంకరణలో వెలిగిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement