Saturday, October 5, 2024

AP – డిటెక్టివ్ ఫాక్సీ ఇక లేదు ….

అనారోగ్యంతో క‌న్నుమూసిన జాగిలం
బాప‌ట్ల పోలీసు శాఖలో తీవ్ర విషాదం
అధికారిక లాంఛనాలతో అంత్య‌క్రియ‌లు
గౌర‌వ వంద‌నం స‌మ‌ర్పించిన పోలీసులు
సెల్యూట్ చేసి.. నివాళుల‌ర్పించిన‌ ఎస్పీ తుషార్‌

ఆంధ్రప్రభ స్మార్ట్, బాపట్ల:
అల‌వాటులో పొర‌పాటుకు.. నీది కుక్క చావే అని చాలామంది తిడుతుంటారు. కానీ, ఈ భూమ్మీద అన్నిటికంటే అత్యంత విశ్వాస‌మైన జంతువు కుక్క అనేది చాలామందికి తెలియ‌నిది కాదు. ఇక‌.. ఈ వార్త చ‌దివితే కుక్క చావు చస్తావు అనేదానికి అర్థం మార్చుకుంటారు. చస్తే పోలీసు జాగిలంలా చనిపోవాలి అనుకుంటారు. అవును.. పోలీస్ డాగ్‌ ఫాక్సీ అంత్యక్రియలు గురువారం అధికారిక లాంఛనాలతో అత్యంత వైభవంగా జ‌రిగాయి. ఎందుకంటే తనువు చాలించిన ఈ జాగిలం సాధారణ క్లూస్ టీమ్ మెంబర్ మాత్ర‌మే కాదు.. దొంగలు, హంతకులు, రేపిస్టుల ఆన‌వాల్లు పసిగట్టగలిగే గ్రేటెస్ట్ డిటెక్టివ్‌గా పేరుగాంచింది.

పోలీసు ఫ్యామిలీ మెంబ‌ర్‌గానే భావించాం..

పోలీసుశాఖలో రెండేళ్ల పాటు అత్యుత్తమ సేవలందించిన ధీర జాగిలం ఫాక్సీ ఇక లేదు. బాపట్ల జిల్లా పోలీసు భద్రతా విభాగంలో 2022 నుంచి విశేష సేవలు అందించిన పోలీసు ట్రాకర్ ఫాక్సీ అయిదేళ్లు మూడు మాసాల ప్రాయంలో అనారోగ్యంతో చ‌నిపోయింది. ఫాక్సీ మృతికి జిల్లా ఎస్పీ తుషార్ డూడి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. డాగ్ కెన్నెల్ భవనంలో ఫాక్సీ పార్థీవ దేహానికి ఎస్పీ పూలమాల వేసి గౌరవ వందనం సమర్పించారు. ఘనంగా సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ శాఖకు ట్రాకర్ విభాగంలో సుమారు రెండేళ్లు ఎనలేని సేవలు అందించిన ఫాక్సీ అనారోగ్యంతో చ‌నిపోవ‌డం బాధాకరంగా ఉందన్నారు. ఫాక్పీని పోలీస్ ఫ్యామిలీ మెంబర్‌గానే భావించామన్నారు. అనేక కీలక సమయాల్లో నేరాల ఛేద‌న‌లో చురుగ్గా, సమర్ధవంతంగా పని చేసిందని వివరించారు. ఫాక్సీ మృతి పోలీసు శాఖకు తీరని లోటన్నారు.

- Advertisement -

ఫ్యాక్సీ క‌థ ఏంటంటే..

డాబర్ మన్ జాతికి చెందిన ఫాక్సీ ఆడ జాగిలం. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ట్రాకర్ విభాగంలో 8 నెలలపాటు శిక్షణ పొందింది. 2020 మార్చి 31న శిక్షణ పూర్తి చేసుకొని ఉమ్మడి గుంటూరు జిల్లా రూరల్ విభాగంలో విధుల్లో చేరింది. మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసును ఛేదించడంలో తొలిసారిగా కీలకంగా వ్యవహరించింది. 2021లో మంగళగిరిలో జరిగిన 27వ బ్యాచ్ రిఫ్రెష్ ట్రైనింగ్‌లో ట్రాకర్ విభాగంలో మొదటి స్థానం పొంది మెడల్ కూడా సాధించింది.

బ‌దిలీపై బాప‌ట్ల‌ రాక‌..

నవంబర్ 2022లో బాపట్ల జిల్లా పోలీస్ శాఖకు బదిలీ కాగా.. ఏఆర్‌ కానిస్టేబుల్ యూ ఏడుకొండలు ఫ్యాక్సీ హ్యాండ్లర్‌గా వ్యవహరించారు. సుమారు రెండేళ్లపాటు బాపట్ల జిల్లా పోలీస్ శాఖకు విశేష సేవలు అందించింది. దొంగతనం, హత్య నేరాలు, మానభంగం కేసుల్లో ఆధారాల సేకరణలో ఫాక్సీ స్పెషలిస్ట్. విధి నిర్వహణలో అంతిమ శ్వాస విడిచిన ఫ్యాక్సీకి అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్, ఏ.ఆర్ డీఎస్పీ చంద్రమోహన్, అడ్మిన్ ఆర్ఐ షేక్.మౌలుద్దీన్, వెల్ఫేర్ ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి డాగ్ హేండిలర్స్ అంతిమ వీడ్కోలు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement