Thursday, April 25, 2024

2023-24 ఏపీ వార్షిక బడ్జెట్‌ 2,79,279 కోట్లు.. సంక్షేమానికి పెద్ద పీట

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగన్‌ సర్కార్‌ జనరంజక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అన్ని రంగాలకు ప్రాధాన్యతను ఇవ్వడంతోపాటు గత వార్షిక బడ్జెట్‌ కంటే అదనపు కేటాయింపులను చేసింది. ఈప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్‌ కావడంతో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్‌లో కేటాయింపులు చేపట్టింది. 2023-24 వార్షిక బడ్జెట్‌ రూ.2,79,279.27 కోట్ల జంబో బడ్జెట్‌ను గురువారం ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. గత బడ్జెట్‌తో పోలిస్తే రెవెన్యూ వ్యయం 22.985 కోట్లు అదనంగా పెరిగింది. 2022-23 సంవత్సరానికి సంబంధించి రూ.2,56,256 కోట్లను కేటాయించారు.

దీంతో గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే ప్రస్తుత బడ్జెట్‌లో రూ.23,023 కోట్ల మేర బడ్జెట్‌లో పెరుగుదల ఉంది. వీటితో పాటు కేంద్రం నుండి రాబడి కూడా గతంతో పోలిస్తే మరింత పెరిగింది. ఇక రాష్ట్రంలోని ప్రధాన రంగాలతోపాటు సంక్షేమ రంగానికి గతంతో పోలిస్తే అధికంగా కేటాయింపులు చేపట్టి తమది సంక్షేమ ప్రభుత్వమని మరోసారి చాటుకున్నారు. అదేవిధంగా అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా కూడా బడ్జెట్‌లో కేటాయింపులు చేపట్టినట్లు స్పష్టంగా అర్ధమౌతోంది. వీటితోపాటు సీఎం జగన్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గృహ నిర్మాణ పథకానికి కూడా కేటాయింపులు పెంచారు. అలాగే వ్యవసాయ రంగానికి దాదాపుగా 3.2 శాతం అధికంగా నిధులను కేటాయించారు. విద్య, వైద్య రంగాలకు మరింత ప్రాధాన్యతను ఇచ్చారు.

- Advertisement -

గతంతో పోలిస్తే పెరిగిన కేటాయింపులు..

బీసీ సంక్షేమమే ధ్యేయంగా జగన్‌ సర్కార్‌ అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. అందులో భాగంగాన బీసీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యతను పెంచింది. ప్రస్తుత బడ్జెట్‌లో కూడా బీసీ సంక్షేమానికి గతంతో పోలిస్తే అదనంగా 32.5 శాతం నిధులను కేటాయించింది. 2022-23 బడ్జెట్‌లో 29.143 కోట్లు కేటాయించగా ఈబడ్జెట్‌లో వారి సంక్షేమానికి రూ. 38,605 కోట్లను కేటాయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంక్షేమానికి మరింత పెద్దపీట వేసినట్లయింది. అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి 10 శాతం అదనంగా నిధులను కేటాయించారు. గత బడ్జెట్‌లో 48,882 కోట్లు కేటాయించగా ఈబడ్జెట్‌లో రూ. 54,208 కోట్లను కేటాయించారు. దీంతో సీఎం జగన్‌ సంక్షేమానికి గత ఏడాది కంటే మరింత ప్రాధాన్యతను ఇచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద సంక్షేమం మరింత క్షేమంగా ఉండేలా నిధులను కేటాయించారు.

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత..

రాష్ట్రంలో పేద విద్యార్ధులకు కార్పొరేట్‌ విద్యను అందించడంతోపాటు నిరుపేదలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలని జగన్‌ సర్కార్‌ సంకల్పించింది. ఆదిశగానే నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలు, వైద్య శాలలను ఆధునీకరిస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా గతంలో నిధులను కూడా కేటాయించి ఆ రెండు రంగాలను శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బడ్జెట్‌లో విద్య, వైద్య రంగానికి కేటాయింపులను పెంచారు. గత ఏడాది 30.077 కోట్లు విద్యా రంగానికి కేటాయించగా ప్రస్తుత బడ్జెట్‌లో రూ.32,179 కోట్లు కేటాయిస్తూ ఆరంగానికి 7 శాతం నిధులను పెంచారు. అలాగే వైద్య రంగానికి సంబంధించి గతంలో రూ. 15,384 కోట్లు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 15,882 కోట్లు కేటాయిస్తూ 3.2 శాతం నిధులను అదనంగా వైద్య రంగానికి కేటాయించారు.

వ్యవసాయ రంగానికి పండుగే..

ముఖ్యమంత్రిగా జగన్‌ మోహన్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారికోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతూ వస్తున్నారు. అదేవిధంగా అనేక సందర్బాల్లో వారికి ఆర్ధిక చేయూతను కూడా అందిస్తునారు. అందుకోసం వివిధ పథకాల ద్వారా నిధులను కూడా వ్యవసాయ రంగానికి వ్యయంచేస్తూ వస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రస్తుత వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఏకంగా రూ.41,436.29 వేల కోట్లను కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే రూ. 4 వేల కోట్లు అదనంగా కేటాయింపులు చేశారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి రూ. 37,343.57 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఆకేటాయింపులను మరింత పెంచారు. 2014-15 నుండి గడచిన దశాబ్దకాలంలో వ్యవసాయ రంగానికి చేపట్టిన కేటాయింపులను పరిశీలిస్తే ప్రస్తుత కేటాయింపులే అధికం.

పెరిగిన కేంద్ర పన్నుల వాటా..

గత బడ్జెట్‌తో పోలిస్తే ఈ బడ్జెట్‌లో కేంద్రం నుండి రావల్సిన పన్నుల వాటా ఆదాయం పెరిగింది. గత ఏడాది రూ.38,176 కోట్ల మేర మాత్రమే కేంద్రం నుండి పన్నుల రూపంలో రాబడి ఉండగా ప్రస్తుత బడ్జెట్‌లో అది రూ. 41,338 కోట్లుకు పెరిగింది. మొత్తం మీద రూ. 3 వేల కోట్లకుపైగా కేంద్రం నుండి ప్రస్తుత ఏడాది పన్నుల రూపంలో రాబడి పెరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement