Thursday, March 28, 2024

ఆయూష్ ప్రవేశాలకు మరోసారి అవకాశం.. 2,3 తేదీల్లో ఆన్ లైన్ దరఖాస్తులు..

వరంగల్, ప్రభన్యూస్ : యూజీ ఆయూష్ సీట్ల ఖాళీల భర్తీకి కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న తాజా నిర్ణయంతో మరోసారి ఆయూష్ కోర్సుల్లో చేరేందుకు అవకాశం కలిగింది. యూజీ నీట్ కటాఫ్ స్కోర్ ను 5 శాతం తగ్గిస్తూ కేంద్ర ఆయూష్ మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనితో ఆయూష్ కోర్సుల్లో సీట్లభర్తీకి వరంగల్ లోని కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ కేటగిరీ లో క్వాలిఫైయింగ్ కటాఫ్ 45 పర్సంటైల్ , దివ్యాంగుల కు 40,ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వుడు కేటగిరీ లకు 35 పర్సంటైల్, లుగా నిర్ణయించారు. కటాఫ్ మార్కులు తగ్గడంతో ఇందు కనుగుణంగా అర్హులైన విద్యార్థులు మరోసారి దరఖాస్తులు చేసుకోవడానికి వెసులుబాటు కలిగింది.

బిహెచ్ ఎంఎస్, బీఏఎంఎస్, బి ఎన్ వైెఎస్, బీయూఎంఎస్, కోర్సుల్లో కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లభర్తీకి హెల్త్ యూనివర్సిటీ మరోసారి ప్రవేశ ప్రకటన జారీచేసింది. ఆసక్తి కలిగిన విద్యార్థులు కన్వీనర్ , యాజమాన్య కోటా లకు విడివిడిగా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. తగ్గిన కటాఫ్ స్కోర్ ఆధారంగా అర్హత సాధించిన విద్యార్థులు ఈ నెల 2న ఉదయం 8గంటలనుండి 3వ తేది మద్యాహ్నం 2గంటల వరకు దరఖాస్తులు చేసుకోవాలని యూనివర్సిటీ ఆ ప్రకటనలో పేర్కొంది. విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు తో పాటు సంబందిత పత్రాలను అప్ లోడ్ చేయాలని వెల్లడించింది. దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. పూర్తి వివరాలకోసం యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement