Friday, April 19, 2024

AP Cabniet: నేడు కొలువు తీరనున్న ఏపీ కొత్త కేబినెట్

ఏపీ కొత్త కేబినెట్ నేడు కొలువుదీరనుంది. కేబినెట్ విస్తరణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కొత్త,పాత వారికి మంత్రులుగా అవకాశం కల్పించారు. 25 మంది కొత్త మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇందుకు ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 11.31 గంటలకు తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాకు పక్కన ప్రత్యేకంగా వేదిక సిద్ధమైంది. అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ చదువుతారు. ఆ ప్రకారం వారితో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇప్పటికే కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఫోన్‌లు చేసి సమాచారం ఇచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో మంత్రులుగ్రూపు ఫొటో దిగుతారు. ఆ వెంటనే సచివాలయంలో గవర్నర్, సీఎం, కొత్త, పాత మంత్రులు, అధికారులకు తేనీటి విందు ఉంటుంది.

కాగా, ఆదివారం రాత్రి కొత్త మంత్రులు జాబితాను సీఎం కార్యాలయం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంపించింది. అంతకు ముందే గవర్నర్‌ 24 మంది పాత మంత్రుల రాజీనామాలకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధికారికంగా పత్రికా ప్రకటన జారీ చేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు 24 మంది మంత్రుల రాజీనామాలను గవర్నర్‌ ఆమోదించారని, ఇది వెంటనే అమల్లోకి వచ్చిందని ఆ ప్రకటనలో తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు 24 మంది మంత్రుల శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉంటాయని పేర్కొన్నారు.

కేబినెట్‌లో బీసీ సామాజికవర్గం నుంచి 10 మంది, ఎస్సీ నుంచి ఐదుగురు, కాపు నుంచి నలుగురు, రెడ్డి నుంచి నలుగురు, ఎస్టీ నుంచి ఒకరు, ఒక ముస్లిం మంత్రులు ఉన్నారు. కొత్త కేబినెట్లో నలుగురు మహిళలకు చోటు దక్కింది. రోజా, వనిత, విడదల రజిని, ఉషశ్రీలకు మంత్రి పదవులు దక్కాయి. అయితే, వీరిలో ముగ్గురు కొత్త మహిళా ఎమ్మెల్యేలు – విడుదల రజిని, ఆర్‌కె రోజా,ఉషశ్రీ చరణ్‌ల పేర్లు జాబితాలో ఉన్నందున రాష్ట్రంలో మళ్లీ మహిళా హోం మంత్రిగా ఉండవచ్చని వర్గాలు తెలిపాయి. 2019లో తొలి దళిత మహిళా హోంమంత్రిగా మేకతోటి సుచరితను సీఎం నియమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement