Monday, May 29, 2023

ఉమ్మడి మెదక్‌ పై అమిత్‌ షా ‘ఫోకస్‌’

ప్రభ న్యూస్‌ బ్యూరో, ఉమ్మడి మెదక్‌ : ఉమ్మడి మెదక్‌ జిల్లా పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఫోకస్‌ చేశారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో ప్రత్యేక రిపోర్టు తెప్పించుకున్న ఆయన ఉమ్మడి మెదక్‌ బీజేపీ శ్రేణులతో ప్రత్యేకంగా చర్చించి వారిలో బూస్ట్‌ నింపి దిశా-నిర్ధేశం చేసేందుకు అంతా సిద్ధం చేశారని తెలుస్తుంది. రాష్ట్రంలో ఈ నెల 11, 12న అమిత్‌ షా టూర్‌ ఉండగా 12న సంగారెడ్డిలో బీజేపీ బహిరంగ సభ ఖరారైంది. ఇప్పటికే అమిత్‌ షా షెడ్యూల్‌ ఖరారు కాగా ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ, 10 అసెంబ్లిd సెగ్మెంట్ల పై ప్రత్యేక చర్చ ఉంటుందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో నెలకొన్న వర్గ విభేదాలపై జిల్లా అధ్యక్షులకు ప్రత్యేక క్లాస్‌ తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉంటే పార్టీలో ముఖ్యమైన చేరికలు ఉంటాయని స్పష్టమవుతుంది. మొత్తానికి సంగారెడ్డి జిల్లాలో బీజేపీ అపరఛాణుక్యుడు అమిత్‌ షా టూర్‌ ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతుండగా ప్రతిపక్షాల్లో కొంత అలజడి వాతావరణం నెలకొంది.

కొడితే ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టాలి.. ఢీ కొంటే కొండనే ఢీకొట్టాలన్నది కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్ట్రాటజీ అని బీజేపీ ముఖ్య శ్రేణులు చర్చించుకుంటారు. ఈ మేరకు ఆయన ఓ నిర్థిష్ట లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ఆ దిశగా కఠోర శ్రమ చేసి విజయం సాధిస్తారనేది బీజేపీ అగ్రనాయకత్వం మాట. ఇప్పుడు ఇదెందుకు చెప్పుకుంటున్నామంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్‌ పై అమిత్‌ షా ప్రత్యేక దృష్టిపెట్టడమే. టార్గెట్‌ 90లో భాగంగా ఇప్పటికే 10 నెలల రోడ్‌ మ్యాప్‌ బీజేపీ సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక ఈ నెల 12న హకీంపేటలో ఓ అధికారిక కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి హాజరుకావాల్సి ఉంది. అయితే రాష్ట్రానికి ఎలాగైనా వస్తున్నందున ఓ సభ ఏర్పాటుచేసి బీజేపీ శ్రేణులకు దిశా-నిర్ధేశం చేయాలని రాష్ట్ర నాయకత్వం కోరింది. హైదరాబాద్‌, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్నందున సభను సంగారెడ్డికి మార్చాలని నిర్ణయించుకున్నారు. 10 నెలల రోడ్‌ మ్యాప్‌ ఖరారు చేసినట్లు బీజేపీ నేతల ద్వారా స్పష్టమైంది. పనిలో పనిగా ఉమ్మడి మెదక్‌ పై ఫోకస్‌ చేసి 2 ఎంపీ, 10 అసెంబ్లిd సెగ్మెంట్ల పై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -
   

జిల్లా నాయకత్వంతో చర్చ…
ఇక ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఇప్పటికే అధ్యక్షులు, ఆయా నియోజకవర్గ సమన్వయ కర్తలు, ఇతర ముఖ్య శ్రేణుల మద్య సమన్వయ లోపం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా రాష్ట్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుల పనితీరు ఒకే అంటూ బీజేపీ స్టేట్‌ బాస్‌ బండి సంజయ్‌ అధినాయకత్వానికి ఓ నివేధిక సమర్పించినట్లు తెలుస్తుండగా హోంమంత్రి అమిత్‌షా తన టీం ద్వారా గ్రౌండ్‌ రిపోర్టు తెప్పించుకున్నట్లు వినికిడి. ఇందులో భాగంగా జిల్లా నాయకత్వం పనితీరు, భవిష్యత్‌ కార్యచరణ, ఎన్నికల్లో టార్గెట్‌ పై దిశా-నిర్ధేశం చేసి వారిలో కొంగొత్త ఉత్తేజాన్ని నిం పనున్నారట. ఇక సంస్థాగతంగా బీజేపీని ఎలా పటిష్టం చేయాలి, క్రమశిక్షణ, టైమింగ్‌తో పాటు యూపీ, బెంగాల్‌లో అమలుచేసిన స్ట్రాటజీని సంగారెడ్డి మీటింగ్‌లో జిల్లా నాయకత్వానికి భోదించే ఛాన్స్‌ ఉంది.

అమిత్‌ షా టూర్‌ సక్సెస్‌ పై రాష్ట్ర బీజేపీ ప్రత్యేక కార్యచరణ
ఈ నెల 11, 12న రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి పర్యటన ఉండగా 12న సంగారెడ్డికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటన అధికారికంగా ఖరారైంది. సంగారెడ్డి టూర్‌ ను సక్సెస్‌ చేసేందుకు రాష్ట్ర బీజేపీ ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే సంగారెడ్డికి బీజేపీ ప్రధాన కార్యదర్శి గజ్జెల ప్రేమేందర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్‌ తదితరులు వచ్చి సభా స్థలి విషయమై ఆయా వేధికలను పరిశీలించి వెళ్లారు. ఇక నాయకులు, కార్యకర్తలు సమీకరణ పై జిల్లా నాయకత్వం పై ఫోకస్‌ పెట్టింది. ఇక ఈ సభకు బూత్‌ స్థాయి అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంచార్జిలు, మండల, మున్సిపల్‌, జిల్లా కేంద్రాల కోర్‌ కమిటీ సభ్యులే కాక మేథావులు కూడా భారీ సంఖ్యలో హాజరవుతున్నట్లు సమాచారం. ఈ సభలో ముఖ్యమైన చేరికలు ఉంటాయని చెబుతుండగా పార్టీ మాత్రం ఎలాంటి లీకులకు తావులేకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement