Thursday, April 18, 2024

అమరావతి కేసుకు నెంబర్ కేటాయింపు.. రేపు మెన్షన్ చేయనున్న ఏపీ సర్కారు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ప్రత్యేక సెలవుకాలీన వ్యాజ్యం (స్పెషల్ లీవ్ పిటిషన్)కు గురువారం సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నెంబర్ కేటాయించింది. ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని, హైకోర్టు తీర్పుపై ముందు స్టే విధించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు శుక్రవారం సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరనున్నట్టు తెలిసింది. గురువారమే ధర్మాసనం ఎదుట ప్రస్తావించి విచారణ కోరాలని భావించినప్పటికీ, భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వేరే కేసులో తుది విచారణకు సమయం కేటాయించడంతో ఈ కేసు విచారణకు సమయం కోరడం సాధ్యపడలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, 6 నెలల్లోగా రాజధానిని అభివృద్ధి చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సవాల్ చేస్తూ గత నెలలో సుప్రీంకోర్టులో 2 వేల పేజీలతో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ‘రిట్ ఆఫ్ మాండమస్’గా పేర్కొంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. శాసనవ్యవస్థకు చట్టాలు రూపొందించుకునే అధికారం ఉందని, న్యాయవ్యవస్థ అందులో జోక్యం చేసుకోవడం తగదని పిటిషన్లో పేర్కొంది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పుపై ముందు ‘స్టే’ విధించాలని అభ్యర్థించింది. ఈ పిటిషన్‌కు గురువారం నెంబర్ రావడంతో వరుస క్రమంలో కేసును జాబితాలో చేర్చే అవకాశం ఉంది. తద్వారా జాప్యం జరిగుతుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వద్ద ప్రస్తావించి, వెంటనే విచారణకు స్వీకరించేలా ప్రయత్నాలు చేస్తోంది.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌లో ప్రతివాదులుగా ఉన్న అమరావతి రైతులు కేవియట్ దాఖలు చేసి తమ వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారికి ఆన్‌లైన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ కాపీలు ఇప్పటికే అందాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement