Thursday, April 18, 2024

పర్యాటక కేంద్రాలుగా అన్ని బౌద్ధ క్షేత్రాలు.. బుద్ధ పూర్ణిమ వేడుకల్లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని బౌద్ధ క్షేత్రాలను పర్యటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పారు. సిఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పర్యటక కేంద్రాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. సోమవారం బుద్ధ పూర్ణిమ సందర్భంగా హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ సరస్సులోని బుద్ధ విగ్రహం వద్ద తెలంగాణ పర్యటక శాఖ బుద్ధుడి 2566వ జయంతి ఉత్సవాలను నిర్వహించింది. ఈ వేడుకల్లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్త, తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, టూరిజం శాఖ ఎండి మనోహర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బౌద్ధ భిక్షువులు బుద్ధుడి పాదుకల వద్ద పుష్పాంజలి ఘటించి, ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.

అనంతరం మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. బౌద్ధ వారసత్వానికి సంబంధించి గొప్ప చరిత్ర తెలంగాణ రాష్ట్రం కలిగి ఉందన్నారు. బాదనకుర్తి నుంచి కోటిలింగాల, ధూలికట్ట, కొండాపూర్‌,ఫణిగిరి, గాజులబండ, నేలకొండపల్లి, నాగార్జునకొండల ద్వారా తెలంగాణ రాష్ట్ర అంతటా ఉన్న ప్రముఖ బౌద్ధ క్షేత్రాలుగా బౌద్ధమతం వ్యాపించిందన్నారు. నాగార్జునసాగర్‌లోని బౌద్ధ వారసత్వ థీమ్‌ పార్కు శ్రీపర్వత ఆరామం(బుద్ధవనం)ను అభివృద్ధి చేశామన్నారు. అక్కడ సిద్ధార్ధ గౌతముడి జీవితంలోని ప్రధాన ఘట్టాలు, ఆయన జీవిత ఇతివృత్తాన్ని వర్ణించే అనేక నేపథ్య విభాగాలు ఏర్పాటు చేశామన్నారు. బుద్ధుడి జయంతి వేడుకలు తెలంగాణలో పర్యాటకానికి, బౌద్ధ వారసత్వాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయన్నారు. జపాన్‌, చైనా, థాయల్యాండ్‌, శ్రీలంక, సింగపూర్‌ తదితర తూర్పు, దక్షిణాసియా దేశాలకు చెందిన విదేశీ పర్యాటకులు తెలంగాణ టూరిజం పట్ల ఆకర్షితులు కావడానికి కారణంగా బౌద్ధ పర్యటక కేంద్రాలేనని ఆయన తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement