Tuesday, March 28, 2023

దేశంలోనే అత్యధికంగా కాలేజీలు ఉన్న టాప్‌ 10 జిల్లాల్లో హైదరాబాద్‌కు 3వ స్థానం.. ఎడ్యుకేషన్‌ 2020-21 రిపోర్టులో వెల్లడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉన్నత విద్యలో హైదరాబాద్‌ దూసుకుపోతోంది. చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం వీటన్నింటికీ కేరాఫ్‌ అడ్రస్‌గా హైదరాబాద్‌ నగరం ఉండడంతో ఇక్కడే చదువుకుని.. ఇక్కడే ఉద్యోగం చేయాలని విద్యార్థులు హైదరాబాద్‌ బాటపడుతున్నారు. ఈనేపథ్యంలోనే విద్యార్థుల అభిరుచి, డిమాండ్‌ ఉన్న కోర్సులతో నాణ్యమైన విద్యను అందించేలా కళాశాలలను ఆయా యాజమాన్యాలు ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా కాలేజీలు ఉన్న టాప్‌ 10 జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రానికి చోటు దక్కింది. ఏకంగా రెండు జిల్లాలకు అందులో చోటు దక్కడం విశేషం. తెలంగాణలోని హైదరాబాద్‌ జిల్లాలకు దేశంలోనే అత్యధికంగా కాలేజీలు ఉన్న జిల్లాగా 3వ స్థానం దక్కగా, రంగారెడ్డి జిల్లాకు 6వ స్థానం దక్కింది.

కేంద్రం విడుదల చేసిన ఆలిండియా సర్వే ఆన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ 2020-21 రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. మొదటి స్థానంలో బెగళూరు అర్బన్‌ జిల్లాకు దక్కింది. అయితే బెగళూరు అర్బన్‌ జిల్లాలో 1058 కాలేజీలు ఉండగా, జైపూర్‌ జిల్లాలో 671 కాలేజీలు, హైదరాబాద్‌ జిల్లాలో 488 కాలేజీలు ఉన్నాయి. పూనె జిల్లాలో 466, ప్రయాగ్రాజ్‌ జిల్లాలో 374, రంగారెడ్డి జిల్లాలో 345, భోపాల్‌ జిల్లాలో 327, నాగ్‌పూర్‌ జిల్లాలో 318, ఘజిపూర్‌ జిల్లాలో 316, సికార్‌ జిల్లాలో 308 కాలేజీలు ఉన్నాయి.

- Advertisement -
   

500-వెయ్యిలోపు కాలేజీలు ఉన్న జిల్లా ఒక్కటే…

దేశంలో 500 నుంచి 1000కు పైగా కాలేజీలు ఉన్న జిల్లాలు రెండే ఉన్నాయి. అందులో జైపూర్‌లో 671కాగా, బెంగళూరు అర్బన్‌లో 1058 ఉన్నాయి. అత్యధికంగా కాలేజీలు ఉన్న టాప్‌ 10 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఒక్క జిల్లాకు కూడా చోటు దక్కకపోవడం గమనార్హం. ఒకటి నుంచి తొమ్మిది కాలేజీలు ఉన్న జిల్లాలు దేశంలో 140 ఉన్నాయి. 10 నుంచి 19 కాలేజీలు ఉన్న జిల్లాలు 91కాగా, 20 నుంచి 49 కాలేజీలు ఉన్న జిల్లాలు 184, 50 నుంచి 99 కాలేజీలు ఉన్న జిల్లాలు 145, 100 నుంచి 199 కాలేజీలు ఉన్న జిల్లాలు 98 ఉన్నాయి.

అదేవిధంగా 200 నుంచి 299 కాలేజీలు ఉన్న జిల్లాలు 29కాగా, 300 నుంచి 399 కాలేజీలు ఉన్న జిల్లాలు కేవలం 6 మాత్రమే ఉన్నాయి. అలాగే 400 నుంచి 499 కాలేజీలు ఉన్న జిల్లాలు 2 కాగా, 500 నుంచి 999 కాలేజీలు ఉన్న జిల్లా 1 కాగా, 1000కి పైగా కాలేజీలు ఉన్న జిల్లా 1 ఉంది.

దేశంలోని పది రాష్ట్రాల్లోనే అత్యధికంగా కాలేజీలు ఉన్నాయి. అందులో ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, తెలంగాణ, కేరళ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 8114 కాలేజీలు ఉండగా ప్రతి లక్ష మందికి 32 కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. మహారాష్ట్రలో 4532 కాలేజీలుండగా, ప్రతి లక్షమందికి 34 కాలేజీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనైతే 2601 కాలేజీలు ఉండగా, ప్రతి లక్షమందికి 49 కాలేజీలున్నాయి. అదే తెలంగాణలో 2062 కాలేజీలు ఉండగా ప్రతి లక్ష మంది జనాభాకు 53 కాలేజీలున్నాయి. దేశంలో ఎక్కువగా పీజీ కోర్సులు తర్వాత అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు అందించే కాలేజీలే అత్యధికంగా ఉన్నాయి. పీహెచ్‌డీ కోర్సులు అందించే కాలేజీలు కేవలం 2.9శాతం ఉండగా, పీజీ కోర్సులున్న కాలేజీలు మాత్రం 55.2 శాతం ఉన్నాయని కేంద్రం తన నివేదికలో వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement