Tuesday, April 23, 2024

అక్షత టీ కప్పు అంత ఖరీదా.. బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషి సునక్‌

బ్రిటన్‌ ప్రధాని రేసులో ఉన్న భారత సంతతికి చెందిన ఎంపీ రిషి సునక్‌ సతీమణి, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి కుమార్తె అక్షత ఓ వివాదంలో చిక్కుకున్నారు. అయితే, అదేమీ రాజకీయాలకు సంబంధించినది కాదు. అది ఓ టీ కప్పులో తుపానులాంటిదే. పైగా ఆమె వాడిన టీకప్పులకు సంబంధించినదే కావడం విశేషం. ఆర్థికమంత్రి రిషి సునక్‌ సహా సొంత మంత్రిమండలి సభ్యులు పెద్దసంఖ్యలో రాజీనామా చేసిన నేపథ్యంలో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ప్రధాని పదవిని చేజిక్కించుకునేందుకు అధికారపక్షానికి చెందిన ఎనిమిది మంది రేసులో ఉన్నారు. వారిలో రిషి సునక్‌ అగ్రస్థానంలోఉన్నారు. ఈ నేపథ్యంలో రిషి సునక్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇంటి ఆరుబయట కూర్చున్న పాత్రికేయులకు రిషి సతీమణి అక్షత స్వయంగా టీ, బిస్కట్లు తీసుకువచ్చి అందించారు. మిలయనీర్‌, పెద్ద రాజకీయ నాయకుడి సతీమణి స్వయంగా టీ తీసుకురావడాన్ని మీడియా మిత్రులు తెగ మెచ్చుకున్నారు.

అయితే, ట్విట్టరాటీల్లో కొందరు మాత్రం ఆమెను ఓ ఆట ఆడుకున్నారు. ఆమె వాడిన టీ కప్పుల ధరను ఉదహరిస్తూ విమర్శలు గుప్పించారు. ఆమె వాడిన టీకప్పులు ప్రఖ్యాత ఎమ్మా లేసీ బ్రాండ్‌కు చెందినవని, ఒక్కో టీ కప్పు ధర 38 పౌండ్లు, అంటే దాదాపు రూ.3,600లని, అంత ఖరీదైనవి వాడారంటే నమ్మలేకపోతున్నామంటూ విమర్శలు గుప్పించారు. ఒక్క టీకప్పు కు చెల్లించిన ధర ఒక కుటుంబానికి రెండురోజులపాటు ఆకలి తీరుస్తుందని పేర్కొన్నారు. పైగా పాత్రికేయులకు స్వయంగా టీ ఇవ్వడం మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు అలవాటని, ఆయనను అనుసరిస్తూ ఇలా వ్యవహరించడమేంటని ఎద్దేవా చేస్తూ ట్వీట్‌లు పెట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement