Friday, March 29, 2024

ఎయిర్‌పోర్టు మెట్రో టెండర్ల ప్రక్రియ షురూ.. రేపు జనరల్‌ కన్సల్టెంట్‌ ఈవోఐపై ప్రీ అప్లికేషన్‌ సమావేశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు నిర్మించబోయే ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. కాంట్రాక్టు ఏజెన్సీలను నియమించే పని మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి మంగళవారం హైదరాబాద్‌లో (హెచ్‌ఏఎంఎల్‌) హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ ప్రీ అప్లికేషన్‌ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో డిజైన్‌ అండ్‌ బిల్డ్‌ బేసిస్‌ మీద జనరల్‌ కన్సల్టెంట్‌(జీసీ)లను ఎంపిక చేయడానికిగాను ఈ నెల 1వ తేదీన ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌(ఈవోఐ) ఆహ్వానించింది. ఈ ఈవోఐకి సంబంధించి కన్సల్టెంట్ల అనుమానాల నివృత్తికి ప్రీ అప్లికేషన్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎంఆర్‌ఎల్‌) అధికారులు తెలిపారు. ఈ ఈవోఐ గడువు ఈ నెల 13 వరకు ఉన్నట్లు హెచ్‌ఏఎంల్‌ ఈవోఐ ఆహ్వాన ప్రకటనలో తెలిపింది.

అత్యాధునిక సదుపాయాలతో ఎయిర్‌పోర్టు మెట్రో…

ప్రయాణికులకు స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ స్థాయి అత్యాధునిక సదుపాయాలతో హెచ్‌ఏఎంఎల్‌ ఎయిర్‌పోర్టు మెట్రోను నిర్మించనుంది. ఈ మెట్రో కారిడార్‌ నిర్మాణంలో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు చెబుతున్నారు. ఎక్స్‌ప్రెస్‌ మెట్రో నిర్మాణానికి పిలిచే టెండర్లలో గతంలో హైదరాబాద్‌ మెట్రో నిర్మించిన ఎల్‌అండ్‌టీ కంపెనీ కూడా పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి కేవలం మెట్రో నిర్మించి ఇచ్చే ఈపీసీ పద్ధతిలోనే ప్రభుత్వం కాంట్రాక్టు ఏజెన్సీలను నియమించనుంది. దీంతో ఇన్‌ఫ్రా కంపెనీలు ఈ ప్రాజెక్టు దక్కించుకునే విషయంలో తీవ్ర పోటీ నెలకొననున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

9న శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు…

ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ మెట్రో ప్రాజెక్టు శంకుస్థాపనకు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 9న సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా జరగనున్న ఈ ప్రాజెక్టు శంకుస్థాపన ఏర్పాట్లపై హైదరాబాద్‌కు చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇటీవలే జీహెచ్‌ఎంసీ మేయర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్‌ పార్టీ ఇంఛార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం కనీవినీ ఎరుగని విధంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని వారిని కోరారు. ఈ కార్యక్రమ విజయవంతానికి ఇటు ప్రభుత్వం, అటు టీఆర్‌ఎస్‌ పార్టీ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. శంకుస్థాపన కార్యక్రమం పూర్తవగానే రాజేంద్రనగర్‌లోని పోలీస్‌గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసే బహిరంగసభలో పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement