Saturday, April 20, 2024

ఎయిర్‌ ఇండియా ఆర్డర్‌ విలువ 70 బిలియన్‌ డాలర్లు.. అంతర్జాతీయ రూట్స్‌లో భారీ విస్తరణ

టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌ ఇండియా ఇటీవల 470 విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చింది. విమానాల తయారీ సంస్థలైన బోయింగ్‌, ఎయిర్‌బస్‌ల నుంచి వీటిని కొనుగోలు చేసేందుకు ఎయిర్‌ ఇండియా ఈ ఆర్డర్‌ ఇచ్చింది. ఈ విమానాల కొనుగోలు విలువ 70 బిలియన్‌ డాలర్లని ఎయిర్‌ ఇండియా సీఈఓ కాంప్‌బెల్‌ విల్సన్‌ తాజాగా ప్రకటించారు. కొత్త విమానాల కొనుగోలుకు కావాల్సిన నిధులను అంతర్గత నగదు లభ్యత, వాటాదారుల ఈక్విటీ, విమానాల విక్రయం, లీజ్‌బ్యాక్‌ వంటి పలు మార్గాల్లో సమకూర్చుకోనున్నట్లు తెలిపారు. ఆర్డర్‌ ఇచ్చిన కొత్త విమానాలు ఈ సంవత్సరం చివరి నుంచి ఎయిర్‌ ఇండియాకు వస్తాయని ఆయన తెలిపారు.

ఫిబ్రవరి 14న ఎయిర్‌ ఇండియా కొత్తగా 470 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో 70 వైడ్‌ బాడీ విమానాలు ఉన్నాయి. మొత్తం విమానాల్లో 220 బోయింగ్‌ కంపెనీ నుంచి, 250 విమానాలను ఎయిర్‌బస్‌ నుంచి కొనుగోలు చేయనుంది. వీటితో పాటు మరో 370 విమానాల కొనుగోలుకు హక్కులు పొందింది. విమానయాన రంగంలో ఎయిర్‌ ఇండియాకు అపారమైన ఆవకాశాలు ఉన్నాయని విల్సన్‌ చెప్పారు. ప్రధానంగా ఇంటర్నేషనల్‌ రూట్స్‌పై ఫోకస్‌ పెట్టినట్లు తెలిపారు.

- Advertisement -

విస్తారా విలీనం..

ఎయిర్‌ ఇండియా విస్తరణలో మూడు దశలు ఉన్నాయని విల్సన్‌ చెప్పారు. ఒకటి పోటీ క్లియరెన్స్‌, రెండవది రెగ్యులేటరీ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌కు(డీజీసీఏ) సంబంధించినది, మూడవది ఎయిర్‌ ఇండియా, విస్తారా రెండు కంపెనీల విలీనమని ఆయన వివరించారు. ప్రస్తుతం విలీన ప్రక్రియ మొదటి దశలో ఉందన్నారు. కాంపీటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం చూస్తున్నామని, తరువాత ఎయిర్‌ ఇండియా, విస్తారా విలీనం రెండో దశలో డీజీసీఏ ఆమోదం కోసం వెళ్తుతుందన్నారు. విలీనం తరువాత విస్తారా ఉండదని, ఎయిర్‌ ఇండియాగానే పరిగణిస్తామని క్యాంప్‌బెల్‌ విల్సన్‌ తెలిపారు. విదేశాల్లో ఎయిర్‌ ఇండియాకు మంచి గుర్తింపు ఉందన్నారు. అంతర్జాతీయ విమానయాన రంగంలో అతి పెద్ద సంస్థగా ఎదిగేందుకు ఇది దోహద పడుతుందని చెప్పారు.

విస్తారాకు ఇండియన్‌ మార్కెట్‌లో మంచి పేరుందన్నారు. 90 సంవత్సరాల చరిత్ర ఉన్న ఎయిర్‌ ఇండియా పేరునే విలీనం తరువాత కొనసాగిస్తామన్నారు. ఎయిర్‌ ఇండియాను కొనుగోలు చేయకముందు, విస్తారా ఎయిర్‌లైన్స్‌ను టాటా గ్రూప్‌ నడిపిస్తోంది. విస్తారాలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు వాటా ఉంది. ఇందులో టాటాలకు 51 శాతం వాటా, మిగిలిన వాటా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు ఉంది. విలీనం తరువాత ఎయిర్‌ ఇండియాలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు 25.1 శాతం వాటా వస్తుంది. అన్ని అనుమతులు సకాలంలో వస్తే 2024, మార్చి నాటికి ఎయిర్‌ ఇండియాలో విస్తారా విలీనం పూర్తవుతుంది. విలీనం తరువాత అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థగా ఎయిర్‌ ఇండియా అవతరించనుంది. దేశీయంగా రెండో అతి పెద్ద సంస్థగా నిలవనుంది.

భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించిన ఎయిర్‌ ఇండియా అంతే స్థాయిలో పైలట్లను, విమాన సిబ్బందిని, గ్రౌండ్‌ సిబ్బందిని, సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లను తీసుకోనుంది. వీరి కోసం ఒక శిక్షణా సంస్థను కూడా ఏర్పాటు చేయనుంది. మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌హల్‌ (ఎంఆర్‌ఓ)ను ఏర్పాటు చేయనుంది. కొత్త విమానాలు వచ్చేదాని కంటే ముందుగానే ఎయిర్‌ ఇండియా 36 విమానాలను లీజ్‌కు తీసుకోనుంది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఎయిర్‌ ఇండియా లోగో మహారాజా కొత్త డిజైన్‌లో రూపొందించనున్నట్లు ఎయిర్‌ ఇండియాకు చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు. దీనిపై సంస్థ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

విమానాల ఆధునీకరణ

ఎయిర్‌ ఇండియాకు ఉన్న ప్రస్తుత వైడ్‌ బాడీ విమానాలను పూర్తిగా ఆధునీకరిస్తోంది. ఇందు కోసం 400 మిలియన్‌ డాలర్లను ఖర్చు చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని 2024 నాటికి పూర్తి చేస్తామని ఎయిర్‌ ఇండియా తెలిపింది. ప్రస్తుతం ఎయిర్‌ ఇండియాకు 6 ఎయిర్‌బస్‌ ఏ 350ఎస్‌ విమానాలు, 5 డెల్టా బోయింగ్‌ 777ఎస్‌ విమానాలు ఉన్నాయి. ఆధునీకరణలో విమానంలోని సీట్లు, కార్పెట్లు, విమానం లోపల ఎంటర్‌టైన్‌మెంట్‌ సిస్టమ్‌తో పాటు అనేక ఆధునిక హంగులను ఏర్పాటు చేస్తోంది. ప్రధానంగా నార్త్‌ అమెరికా, యూరోప్‌కు విమాన సర్వీస్‌లను పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఎయిర్‌ ఇండియాను కొనుగోలు చేసిన వెంటనే టాటా గ్రూప్‌ వాలంటరీ రిటైర్మెంట్‌ను ప్రకటించింది. ఈ స్కీమ్‌లో 1,500 మంది ఉద్యోగులు రిటైర్‌ అయ్యారు. దీంతో సిబ్బంది కొరతతో 2022లో 20 ఎయిర్‌ ఇండియా విమానాలు ఆలస్యంగా వెళ్లడమో, కాన్సిల్‌ కావడంమో జరిగింది. దీంతో శిక్షణ పూర్తి చేసుకున్న 500 మందిని డ్యూటీకి తీసుకున్నామని విల్సన్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement