Thursday, April 25, 2024

ప్రైవేట్‌ కాలేజీలుగా మారుతున్న ఎయిడెడ్‌ కళాశాలలు.. తగ్గుతున్న ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల సంఖ్య

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రతీ సంవత్సరం అవి ఎయిడెడ్‌ నుంచి ప్రైవేట్‌గా మారుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల చుట్టుపక్కల ఉండే పేద విద్యార్థులకు విద్య అందకుండా పోతోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో పోల్చుకుంటే ఎయిడెడ్‌ కళాశాలల్లో నామ మాత్రపు ఫీజు, మంచి బోధన, వసతులు మెరుగ్గా ఉంటాయి. దీంతో ప్రైవేట్‌ కాలేజీల్లో చేరని విద్యార్థులు ఎయిడెడ్‌ కళాశాలల్లో చేరేందుకు ఇష్టపడుతారు. అయితే ప్రతి ఏడాది రాష్ట్రంలోని ఎయిడ్‌ కళాశాలల సంఖ్య క్రమంగా తగ్గుకుంటూ పోతోంది.

- Advertisement -

2018-19 విద్యా సంవత్సరంలో 47 ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలుంటే గతేడాది 2022-23 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ఎయిడెడ్‌ కాలేజీల సంఖ్య 30కి పడిపోయింది. గత ఐదేళ్లలో 17 ఎయిడెడ్‌ కళాశాలలు ప్రైవేట్‌ కాలేజీలుగా మారాయి. ఇవి ప్రైవేట్‌ కాలేజీలుగా మారడంతో ఫీజులు కూడా పెరుగుతాయి. అప్పటి వరకు అందులో చదవాలనుకునే విద్యార్థులకు ఫీజులు భారంగా మారనున్నాయి.

దీంతో ఎయిడెడ్‌ కాలేజీల్లో చేరే పరిస్థితులు లేకపోవడంతో విద్యార్థులు ఇతర కాలేజీల్లో చేరుతున్నారు. మరోవైపు ఎయిడెడ్‌ కాలేజీల్లో అధ్యాపకుల కొరత వెంటాడుతోంది. ఈ క్రమంలో అందులో చేరే విద్యార్థుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. విద్యార్థులు చేరడంలేదనే సాకుతోపాటు, ఇతరత్ర కారణాలతో ఎయిడెడ్‌ కాలేజీలను ప్రైవేట్‌ కాలేజీలుగా మార్చేస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో 30 ఎయిడెడ్‌ కాలేజీల్లో మొత్తం 11,220 సీట్లు అందుబాటులో ఉంటే అందులో 6682 మంది విద్యార్థులు చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement