Friday, April 26, 2024

Delhi | కర్ణాటక తరహా సయోధ్య అస్త్రం.. రాజస్థాన్‌లోనూ ప్రయోగం.. నాయకత్వ పోరుపై ఏఐసీసీ మధ్యేమార్గం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు దెబ్బతీస్తున్న అనైక్యత, అంతర్గత విబేధాలు, నాయకత్వ పోరును పరిష్కరించేందుకు అధిష్టానం నడుం బిగించింది. తాజాగా కర్ణాటకలో అమలు చేసి, ఘన విజయం సాధించిన సయోధ్య ఫార్ములాను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో కొద్ది నెలల్లో ఎన్నికలు జరుపుకోబోతున్న రాష్ట్రాల్లో అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్న రాజస్థాన్‌పై దృష్టి పెట్టింది.

సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో కలిసి రాజస్థాన్ నేతల మధ్య రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. సోమవారం మధ్యాహ్నం నుంచి జరిగిన వరుస సమావేశాల్లో సీఎం అశోక్ గెహ్లోత్‌ ఉండగా ఆయనతో విబేధిస్తూ దీక్షలు చేస్తున్న మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ రాత్రికి ఖర్గే నివాసానికి చేరుకున్నారు. ఒక్కపూటలో తేలే అంశం కానప్పటికీ కొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధిష్టానం భావిస్తోంది.

- Advertisement -

రాజస్థాన్‌‍లోనూ కర్ణాటక ఫార్ములా

రాజకీయాల్లో నాయకత్వ విబేధాలను పరిష్కరించడం అంటే “కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం” అన్న సామెతను తలపిస్తుంటాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ఇంతకాలం ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. అయితే విబేధాలు పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తున్న నేపథ్యంలో కర్ణాటకలో ఎలాగైనా పార్టీని గెలిపించి తీరాలని భావించిన గాంధీ కుటుంబం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బాధ్యతలు అప్పగించింది. ఖర్గే కూడా కర్ణాటకకు చెందినవారే కావడంతో రాష్ట్రంలో సీఎం సీటు కోసం పోటీపడుతున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్లను పిలిపించి, మంతనాలు సాగించి మొత్తానికి ఇద్దరికీ అధికారాన్ని పంచి ఇచ్చేలా ఓ రాజీ ఫార్ములాతో సయోధ్య కుదిర్చారు.

నిజానికి ఎన్నికల ముందు నుంచే ఇద్దరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి, కలసికట్టుగా నడిపించడంలో జాతీయ నాయకత్వం విజయం సాధించింది. ఇప్పుడు ఇదే తరహాలో రాజస్థాన్‌లో అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్ మధ్య రాజీ ఫార్ములా రూపొందించే పనిలో అధిష్టానం నిమగ్నమైంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ పార్టీలో సోనియా గాంధీకి విధేయుడిగా పేరుంది. రాజకీయ వ్యూహకర్తగా, చివరి నిమిషంలో అనూహ్య ఎత్తుగడలతో చిత్తు చేయగల నేర్పరిగా ఆయనకు పేరుంది. మరోవైపు యువ నేత సచిన్ పైలట్‌కు రాహుల్ గాంధీ అండదండలు దండిగా ఉండేవని, అయితే ఆయన తిరుగుబాటు తర్వాత కొంత అభిప్రాయం మారిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఖర్గేదే తుది నిర్ణయం పూర్తి వెసులుబాటు కల్పించిన గాంధీ కుటుంబం

పార్టీకి సంబంధించి క్లిష్ట సమస్యలు తలెత్తినప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనంతట తానుగా నిర్ణయాలు తీసుకోకుండా గాంధీ కుటుంబాన్ని సంప్రదిస్తున్న విషయం తెలిసిందే. పేరుకు ఖర్గే అధ్యక్షుడైనప్పటికీ అంతా గాంధీ కుటుంబం కనుసన్నల్లోనే నడుస్తుందన్నది జగద్విదితమే. అయితే కర్ణాటక సంక్షోభం సహా అనేకాంశాల పరిష్కారంలో ఖర్గేకు గాంధీ కుటుంబం పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టు కనిపిస్తోంది. రాజస్థాన్ వ్యవహారంలోనూ పార్టీ శ్రేణులకు గాంధీ కుటుంబం ఒక స్పష్టమైన సందేశాన్ని పంపించిందని, ఖర్గే తీసుకునే ఏ నిర్ణయమైనా గాంధీ కుటుంబం నిర్ణయంగానే పరిగణించాలని చెప్పినట్టు సమాచారం.

ఈ పరిస్థితుల్లో ఖర్గే ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీని కొనసాగిస్తున్న రాజస్థాన్‌లో వరుసగా రెండోసారి గెలుపొందాలంటే ముందు ఇంటి పోరును పరిష్కరించక తప్పదు. నేతలిద్దరూ విబేధాలు పక్కనపెట్టి కలసికట్టుగా పనిచేస్తే తప్ప ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చే పరిస్థితి లేదు. అయితే ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడం అంత సులభమైన పనేమీ కాదు. 2013లో పార్టీ ఓటమి తర్వాత ఐదేళ్ల పాటు పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి, శ్రమించి 2018లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చానని సచిన్ పైలట్ చెబుతున్నారు.

అయినప్పటికీ యువ నాయకత్వం కంటే అనుభవానికే పెద్దపీట వేస్తూ అశోక్ గెహ్లోత్‌కు సీఎం సీటు కట్టబెట్టడం ఆయనకు ససేమిరా ఇష్టం లేదు. సచిన్ పైలట్ 2022లో తిరుగుబాటు చేసినప్పుడు ఎక్కువమంది ఎమ్మెల్యేలు గెహ్లోత్ పక్షాన నిలవడంతో ఆయన బలం ఏంటో అధిష్టానానికి తెలుసు. కర్ణాటక మాదిరిగా ఇక్కడ నేతలిద్దరి మధ్య సయోధ్య కుదర్చలేని స్థాయిలో విబేధాలు, శతృత్వం నెలకొన్నాయి. మరి అధిష్టానం ఇద్దరికీ ఎలా సర్దిచెబుతుందన్నదే ప్రశ్నగా మారింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement