Sunday, December 3, 2023

శరవేగంగా ఏజెన్సీ అందాల హైవే నిర్మాణ పనులు.. పర్యాటక, రవాణా రంగాలకు ఊతమిచ్చేలా నిర్మాణం

అమరావతి, ఆంధ్రప్రభ: ఏజెన్సీ ప్రాంతంలో మరో కొత్త జాతీయ రహదారి నిర్మాణం పట్టాలెెక్కింది. ప్రకృతి అందాల మధ్య మూడు జిల్లాలను కలుపుతూ, రెండు వరుసల రహదారి నిర్మాణం శరవేగంగా సాగుతోంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నుంచి విజయనగరం వరకు కొత్త జాతీయ రహదారి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొత్తం 370 కిమీ మేర ఈ రెండు వరుసల కొత్త జాతీయ రహదారి నిర్మాణం సాగుతోంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1575 కోట్లను మంజూరు చేయడంతో ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఇంకా భూ సేకరణ జరుగుతున్నప్పటికీ రహదారి నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 74 అడుగుల వెడల్పు విస్తీర్ణంలో రహదారిని నిర్మిస్తున్నారు.

- Advertisement -
   

దీనిలో 34 అడుగుల మేర తారురోడ్డు నిర్మాణం సాగుతుండగా ఆ రోడ్డుకు రెండు వైపులా మరో 20 అడుగుల మేర విస్తీర్ణంలో మట్టిరోడ్డును నిర్మిస్తూ విస్తరిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడెక్కడ కల్వర్టులు, వంతెనలు అవసరమో వాటిని ఇప్పటికే గుర్తించిన ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఆ మేరకు అవసరమైన ప్రణాళికలను రూపొందించి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏజెన్సీ అందాల నడుమ నిర్మాణం అవుతున్న ఈ రహదారి రాష్ట్ర పర్యాటక రంగానికి ఎంతో ఊతాన్నిచ్చేలా నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ రహదారి నిర్మాణానికి 2018 లోనే ప్రతిపాదనలు చేసినప్పటికీ ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. అయితే తాజాగా ఇప్పుడు కేంద్రం పనులకు ఆమోదం తెలపడంతో పాటు పాటు నిధులు మంజూరు చేయడంతో ప్రాజెక్ట్‌ పనులు సాగుతున్నాయి.

మొత్తం 370 కిమీ మేర నిర్మిస్తున్న ఈ కొత్త రహదారిని మొత్తం ఆరు బ్లాక్‌లుగా ఎన్‌హెచ్‌ఏఐ అధి కారులు విభజించారు. రాజమండ్రి నుంచి రంపచోడవరం వరకూ 44 కిమీల నిర్మాణాన్ని ఒక బ్లాక్‌గా, అక్కడ నుంచి కాకరపాడు వరకూ 74 కిమీల దూరాన్ని మరో బ్లాక్‌గా కాకరపాడు నుంచి పాడేరు 133 కిమీల రహదారిని ఇంకొక బ్లాక్‌గా విభజించారు. అలాగే పాడేరు నుంచి విజయనగరం వరకు ఉన్న 119 కిమీల రహదారి నిర్మాణాన్ని మరో మూడు బ్లాక్‌లుగా నిర్మాణాన్ని విభజించి పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు.

కొత్త హైవేతో మెరుగైన రవాణా వ్యవస్థ..

తాజాగా నిర్మించనున్న ఈ హైవేతో ఏజెన్సీ ప్రాంత రవాణా వ్యవస్ధ మరింత మెరుగుకానుంది. అంతేకాకుండా పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా నుంచి ఏజెన్సీకి మరింత సులువైన రవాణా వ్యవస్ధ అందుబాటులోకి రానుంది. ఇంకోవైపు పర్యాటకంగా కూడా ఈ కొత్త హైవే నిలువనుంది. వివిధ రాష్ట్రాల నుంచి లంబసింగి, పాడేరు, అరకు తదితర ప్రాంతాలకు నిత్యం వేలాది మంది పర్యాటకులు వసూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ హైవే వారిని మరింత ఆకట్టుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు ప్రాంతంలో రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. బ్లాక్‌వన్‌ పనులు మొదలు కావడంతో పాటు మిగిలిన ప్రాంతాలలో నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా మొదలు పెట్టేందుకు ఎన్‌హెచ్‌ఏఐ సన్నాహాలు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement