Friday, April 26, 2024

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లాభం రెండింతలు.. బొగ్గు ట్రేడింగ్‌లో పురోగతి..

2023 ఆర్థికసంవత్సరానికి గాను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ క్యు4 ఫలితాలను గురువారం వెల్లడించింది. గతేడాది కంటే దాదాపు 137 శాతం అధికంగా లాభాలు ఆర్జించినట్లు ఎక్స్చేంజికి సమర్పించిన ఫైలింగ్‌లో వెల్లడించింది. కీలకమైన బొగ్గు వ్యాపారంలో బలమైన పనితీరు కారణంగా మెరుగైన లాభాలు సాధించామని తెలిపింది. మార్చి 31తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత లాభం 722 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించింది. కిందటేడాది ఇది రూ. 304కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో బొగ్గు ధరలు తగ్గినప్పటికీ, ట్రేడింగ్‌ వ్యాపారం అధిక వాల్యూమ్‌లతో పాటు కాస్ట్‌ ఆప్టిమైజేషన్‌తో లాభపడిందని కంపెనీ తెలిపింది.

వేసవిలో విద్యుత్‌ వినియోగం పెరుగుతుందనే అంచనాతో విద్యుత్‌ ప్లాంట్లు ఇంధనాన్ని నిల్వ చేయడంతో ఈ ఏడాది బొగ్గుకు డిమాండ్‌ పెరిగింది. గ్రీన్‌ ఎనర్జీ కార్యకలాపాలను కలిగి ఉన్న న్యూ ఇండస్ట్రీస్‌ ఎకోసిస్టమ్‌ వ్యాపారంలో ఎబిడిటా ఈ త్రైమాసికంలో 23శాతం పెరిగిందని కంపెనీ తెలిపింది. బిలియనీర్‌ గౌతమ్‌ అదానీని ఐదేళ్ల కాలానికి ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా మళ్లి నియమించినట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది.

నిర్వహణ ఆదాయం రూ.31, 346 కోట్ల నుంచి 26శాతం వృద్ధితో రూ. 24,865 కోట్లకు పెరిగింది. అదే సమయంలో రెవెన్యూ రూ.69,420 కోట్ల నుంచి రూ.1,36,977కోట్లకు చేరుకుంది. నికర వ్యయాలు రూ.22.31శాతం పెరిగి రూ.30,139కోట్లకు చేరాయి. వార్షిక ఆదాయం 137శాతం పెరిగి రూ.137.40కోట్లకు చేరుకుందని కంపెనీ వెల్లడించింది. ఈపీఎస్‌ గతేడాది రూ.2.77 గా ఉండగా, ఇప్పుడు రూ.6.34కి చేరింది. రూ.1 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుపై రూ.1.20 వంతున డివిడెంట్‌ చెల్లించేందుకు బోర్డు అంగీకరించింది. ఇందుకు రికార్డు డేట్‌ను జులై 7గా నిర్ణయించారు. 21 జులై తర్వాత డివిడెంట్‌ మొత్తాన్ని వాటాదారుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement