Sunday, March 24, 2024

నెల రోజుల్లో శిఖరం నుంచి పాతాళానికి అదానీ సామ్రాజ్యం.. రోజుకు సగటున 52,343 కోట్లు నష్టం

భారత పారిశ్రామిక రంగంలో రాకెట్‌ కంటే వేగంగా శిఖరాగ్రానికి చేరిన గౌతమ్‌ అదానీ అంతే వేగంగా పాతాళానికి పడిపోతున్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ పారిశ్రామికవేత్త, లేదా గ్రూప్‌ ఇంత వేగంగా సంపదను కోల్పోలేదు. జనవరి 24న అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ అదానీ గ్రూప్‌పై పలు తీవ్రమైన ఆరోపణలతో ఒక నివేదికను విడుదల చేసింది. నివేదిక విడుదల అయ్యే సమయానికి అదానీ గ్రూప్‌ కంపెనీల సంపద 19.2 లక్షల కోట్లు. బిలియనీర్ల జాబితాలో గౌతమ్‌ అదానీ ప్రపంచంలోనే 3వ స్థానానికి చేరుకున్నారు. ఆసియాలో నెంబర్‌ 1 స్థానంలో ఉన్నారు. కేంద్రంలోని పెద్దల అండ పూర్తిగా ఉన్న అదానీ కేవలం రెండు సంవత్సరాల్లో సంపదను 80 శాతానికి పైగా పెంచుకున్నారు. ప్రపంచంలో దేశంలోనూ పారిశ్రామికవేత్తలు కోవిడ్‌ సమయంలో సంపద ఇంతలా పెంచుకున్న వారులేరు.

అదానీ ఇంత తక్కువ సమయంలో అపరకుబేరుడిగా అవతరించడానికి ప్రధానంగా కంపెనీల, సంస్థల కొనుగోళ్లతో సాధ్యమైంది. అదానీ అడిగిందే తడవుగా ఆర్ధిక సంస్థలు, బ్యాంక్‌లు, ఎల్‌ఐసీ పోటీలు పడి రుణాలు ఇచ్చాయి. పెట్టుబడులు పెట్టాయి. మార్కెట్‌లో అదానీ కంపెనీల షేర్లు కూడా రాకెట్‌ వేగంతో దూసుకుపోయాయి. ఫలితంగా కోట్లాది మంది అదానీ గ్రూప్‌ కంపెనీల్లో భారీగా షేర్లు కొనుగోలు చేశారు.

- Advertisement -

అదానీ గ్రూప్‌ అప్పుల కుప్పలా ఉందని, ఇది పేలిపోవడానికి సిద్ధంగా ఉన్న బుడగ వంటిదని క్రెడిట్‌ షూస్‌ చాలా కాలం క్రితమే హెచ్చరించింది. ఈ ఆరోపణల నుంచి అదానీ తేలిగ్గానే బయటపడ్డారు. జనవరి 24 హిండెన్‌బర్గ్‌ బలమైన ఆధారాలతో చేసిన ఆరోపణల దెబ్బకు మాత్రం అదానీ బిజినెస్‌ సామ్రాజ్యం అతలాకుతలం అవుతోది. అదానీ కంపెనీ షేర్ల విలువను కృత్రిమంగా పెంచుతోందని, అకౌంటింగ్‌ మోసాలకు పాల్పడుతున్నదని హిండెన్‌బర్గ్‌ వెల్లడించింది. డొల్ల కంపెనీలు పెట్టి పన్నులు ఎగవేతకు పాల్పడిందని, అనైతిక వ్యాపారాలు చేస్తోందని ఆరోపించింది.

హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడే సమయానికి గౌతమ్‌ అదానీ సంపద విలువ 19.2 లక్షల కోట్లు. ఫిబ్రవరి 24 నాటికి అదానీ గ్రూప్‌ సంస్థల విలువ 7.15 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ నెలరోజుల్లో 12.05 లక్షల కోట్ల సంపదను కోల్పోయింది. దీంతో అపరకుబేరుల జాబితాలో 3వ స్థానం నుంచి 29వ స్థానానికి పడిపోయారు. స్టాక్‌మార్కెట్‌లో కేవలం 23 ట్రేడింగ్‌ సెషన్స్‌లో అదానీ గ్రూప్‌ కంపెనీలు 80 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయాయి. కంపెనీల సంపద పరంగా చూస్తే మన దేశంలో టాటా గ్రూప్‌, రిలయన్స్‌, రాహుల్‌ బజాజ్‌ గ్రూప్‌ తరువాత అదానీ గ్రూప్‌ ఉంది. ఈ నివేదికకు ముందు టాటా తరువాత రెండో స్థానంలో అదానీ గ్రూప్‌ ఉంది.

అదానీ గ్రూప్‌ కంపె నీల షేర్లు ఇంతలా పతనం కావడంతో మన దేశ కంపెనీల మార్కెట్‌ విలువ 280.4 లక్షల కోట్ల నుంచి 260 లక్షల కోట్లకు పడిపోయింది. నెలరోజుల్లో 20.4 లక్షల కోట్లు మార్కెట్‌ విలువ కోల్పోయింది. అదానీ గ్రూప్‌ షేర్ల దెబ్బకు సామాన్య ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ అన్నింటికంటే అత్యధికంగా నష్టపోయింది. గురువారం నాటికి పెట్టుబడికి, విలువకు మధ్య వ్యత్యాసం 3వేల కోట్లుగా ఉంది. శుక్రవారం నాడు అదానీ కంపెనీల షేర్లు మరింత పతనం కావడంతో ఇప్పుడు ఎల్‌ఐసీ మైనస్‌లోకి వెళ్లింది. అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ 30,127 కోట్లతో షేర్లు కొనుగోలు చేసింది. ఒక దశలో ఈ విలువ 50 వేల కోట్లకు చేరింది.

శనివారం నాడు వెల్లడైని తాజా వివరాల ప్రకారం ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ 25,000 కోట్లకు పడిపోయింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ మాత్రం స్వల్పంగానే నష్టపోయాయి. సాధారణంగా చాల మ్యూచువల్‌ ఫండ్స్‌ నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్‌ 50 స్టాక్స్‌లోనే ఎక్కువ పెట్టుబడులు పెట్టాయి. నిఫ్టీ 50లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్లు ఉన్నాయి. హిండెన్‌బర్గ్‌ నివేదిక తరువాత అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు విలువ 62 శాతం, అదానీ పోర్ట్స్‌ షేరు విలు 27 శాతం తగ్గాయి. వీటిలో పెట్టుబడులు పెట్టిన ఫండ్స్‌ వెయిటేజీ ఆ మేరకు తగ్గింది.

డిసెంబర్‌ 2022 నాటికి అదానీ గ్రూప్‌ కంపెనీల్లో రిలైట్‌ ఇన్వెస్టర్లు 1 నుంచి 11 శాతం వరకు పెట్టుబడులు కలిగి ఉన్నారు. ఎక్కువగా అదానీకి చెందిన ఏసీసీ సిమెంట్స్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ లో 11 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటాలు ఉన్నాయి. వీటి ప్రస్తుత విలువ రెండు శాతం లోపుకు పడిపోయింది. దీంతో రిటైల్‌ ఇన్వెస్ట ర్లు ఎంతలా నష్టపోయారో అర్ధం అవుతోంది. స్టాక్‌మార్కెట్లలో ఇప్పటికే చాలా ఇదే తరహాలో వ్యక్తులు, సంస్థల తప్పిదాల మూలంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారని, ఇలాంటివి జరగకుండా నియంత్రణ సంస్థలను బలోపేతం చేయడంతో పాటు, ఇవి మరింత నిఘా పెట్టాల్సి ఉందని మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు. అదానీ గ్రూప్‌ల వ్యవహారం కార్పోరేట్‌ రంగంలోకి ఒక గుణపాఠం వంటిదని వీరు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement