Saturday, March 23, 2024

ఒమ్మాస్‌తో జవాబుదారీతనం.. గ్రామీణ్ సడక్ యోజనలో పారదర్శకత : కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)లో లోపాలను ఎత్తిచూపుతూ 2016లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జరనల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదికను దృష్టిలో పెట్టుకుని తాము మరింత పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని కేంద్రం తెలిపింది. వీటిపై అనకాపల్లి ఎంపీ డా. భీసెట్టి వెంకట సత్యవతి (వైఎస్సార్సీపీ) మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి బదులిచ్చారు. లిఖితపూర్వకంగా ఇచ్చిన ఈ సమాధానంలో ఆన్‌లైన్ మేనేజ్‌మెంట్, మానిటరింగ్, అకౌంటింగ్ సిస్టమ్ (OMMAS)లో సంబంధించిన డేటా అప్‌డేషన్ పరంగా కాగ్ నివేదికలో ఎత్తి చూపిన లోపాలను పరిష్కరించినట్టు పేర్కొన్నారు.

గ్రామీణ్ సడక్ యోజనలోని వివిధ అంశాలను పర్యవేక్షించడానికి ఒమ్మాస్ ఒక బలమైన పరికరమని, కాలక్రమేణా దీన్ని మరింత సమయోచితంగా మార్చడానికి వివిధ ఫీచర్లు జోడించామని వివరించారు. నీతి ఆయోగ్ తన నివేదికలో ఒమ్మాస్‌ను ప్రశంసించిందని వెల్లడించారు. అలాగే గ్రామీణ్ సడక్ యోజన కింద చేపట్టిన ఇతర సాంకేతిక కార్యక్రమాల్లో ఒమ్మాస్ పారదర్శకతతో పాటు అన్ని ప్రయోజనాలను అందిస్తోందన్నారు. గ్రామీణ్ సడక్ యోజన పనులను సకాలంలో పర్యవేక్షించడానికి ఒమ్మాస్ సహకరిస్తుందని, తద్వారా పారదర్శకత, జవాబుదారీతనం నెలకొంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. బ్లాక్ పంచాయతీలో ప్రణాళిక, రోడ్ల జియో-ట్యాగింగ్, నెలవారీ ప్రాతిపదికన సకాలంలో పథకం పూర్తవడంతో దోహదపడుతుందని వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement