Friday, May 27, 2022

పంజాబ్ లో పట్టు బిగిస్తున్న ఆప్

ప్ర‌భ‌న్యూస్ : చండీగఢ్ఢిల్లీలో చక్రం తిప్పి రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆదమీ పార్టీ చాలారోజులుగా పంజాబ్ పై కన్నేసింది. అయితే గత ఎన్నికల్లో ప్రభావం చూపినప్పటికీ చెప్పుకోదగ్గ ఫలితం సాధించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలిస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టేలా కేజ్రీవాల్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటినుంచే అందుకు వ్యూహం అమలు చేస్తున్నారు. పంజబాలో నెలకొన్ని రాజకీయ అనిస్చితి తమకు అనుకూలిస్తుందని కేజ్రీవాల్ గట్టిగా నమ్ముతున్నారు. రాజకీయ వ్యూహకర్త పి.కె. సలహాలు దీనికి తోడయ్యాయి. గత శాసనసభ ఎన్నికల్లో 117 స్థానాల అసెంబ్లీలో 20 స్థానాలు నెగ్గింది. 2014లో 4 ఎంపీ స్థానాలు గెలుచుకున్న ఆప్ 2019లో మాత్రంకేవలం ఒక స్థానానికే పరిమితమైంది. అంతమాత్రాన ఆ పార్టీ నిరాశ చెందలేదు. ప్రజాదరణ లేదని చెప్పలేని పరిస్థితి. శాసనసభ స్థానాలు రాకపోయినప్పటికీ గణనీయంగానే ఓట్లు వచ్చాయి.

అందువల్లే వచ్చే శాసనసభ ఎన్నికలపై దృష్టి పెట్టి పనిచేస్తోంది. సాగుచట్టాల నేపథ్యంలో ఎన్డీయే నుంచి అకాలీదళ్ వేరుపడింది. కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన అమరీందర్ బయటకు వెళ్లిపోయారు. నవజ్యోత్ సింగ్ సిద్దూ పీసీసీ సారధిగా బాధ్యతలు చేపట్టినా కొత్త ముఖ్యమంత్రి చన్నీతో పొసగడం లేదు. తరచూ కీచులాటలతో అటు ప్రజలు, ఇటు కాంగ్రెస్ అధిష్టానం విసిగిపోయాయి. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం సాగు చట్టాలు రద్దు చేసినప్పటికీ రైతులనుంచి బీజేపీకి ఎంతవరకు మద్దతు లభిస్తుందో చెప్పలేం. ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు కేజ్రీవాల్ క్షేత్రస్థాయిలో వ్యూహాలు అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ లో పరిస్థితులను చూసి వచ్చే ఎన్నికల్లో దెబ్బతింటామన్న గుబులు ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో నెలకొంది.

కాంగ్రెస్ నుంచి 35మంది వరకు ఎమ్మెల్యేలు ఆప్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని కేజ్రీవాల్ స్వయంగా ప్రకటించారు. అయితే వారంతా సరైన నాయకులు కారని, అలాంటి చెత్తమాకొద్దని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కొన్ని కీలకాంశాలు పరిశీలించొచ్చు. అమృత్ సర్ కాంగ్రెస్ కంచుకోట. ఇక్కడ ఎమ్మెల్యే ఓమ్ ప్రకాశ్ సోని ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే 40 ఏళ్లుగా కాంగ్రెస్ లోనే పనిచేస్తున్న సుఖ్ దేవ్ సింగ్ కూడా కాంగ్రెస్ లో ఇమడలేకపోతున్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ లో ఉన్నానని, గెలుపు ఓటములు చూశానని, అయితే ప్రస్తుతం కాంగ్రెస్ భవితవ్యంపై ఆశలు లేవని సుఖ్ దేవ్ సింగ్ అంటున్నారు. ఆప్ అవకాశం ఇస్తే పోటీ చేస్తానని సన్నిహితులతో చెబుతున్నారు.

పేదలకు ఆ పార్టీ మేలు చేస్తుందని భావిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ కార్యకర్త జ్యోతి ఖన్నా కూడా ఆప్ పై ఆశలు పెట్టుకున్నారు. మాదకద్రవ్యాల సమస్యను కాంగ్రెస్ పరిష్కరించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ లో ఎప్పుడూ కాంగ్రెస్, అకాలీదళ్ మధ్యే పోటీ ఉంటుందని, కానీ ఈసారి ఆప్ గట్టిపోటీ ఇవ్వబోతోందని యువత అభిప్రాయపడుతోంది. కానీ మోగా వంటి ప్రాంతాల్లో మహిళా ఓటర్లు మాత్రం ఆప్ పై పెద్ద ఆసక్తి చూపడం లేదు. అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తానన్న హామీ వారిని ఆకర్షించడం లేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న చన్నీ సారథ్యంలో ప్రభుత్వం బాగా పనిచేస్తోందని వారు అంటున్నారు.

అయితే కేజ్రీవాల్ ఈ ప్రాంతంపై దృష్టి సారించారు. ప్రముఖ నటుడు, సామాజికవేత్త సోనూసూద్ ఇక్కడి వాడే. ఆయన ఇటీవల కేజ్రీవాల్ ను కలిశారు. అలాగే, ఇదే ప్రాంతానికి చెందిన ఖళీ ఆప్ లో చేరారు. రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రతిష్ఠ 20 శాతం తగ్గిపోయిందని మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఇటీవల చెప్పారు. ఆయన సారథ్యంలో జులై-సెప్టెంబర్ నెలల మధ్య నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం తేలిందని చెప్పుకొచ్చారు. ఈసారి పంజాబ్ లో విభిన్న రాజకీయ పరిస్థితులు ఉంటాయని, వచ్చే ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలతో పాటు ఆయా పార్టీల అసంతృప్తుల కూటమితోపాటు మరో ఫ్రంట్ కూడా బరిలో ఉంటుందని అంచనావేస్తున్నారు. ఆప్ కు పరిస్థితులు సానుకూలంగానే ఉన్నప్పటికీ ప్రజల అభిప్రాయాన్ని ఎంతమేరకు ఓట్లుగా మలుచుకుంటుందనే దానిపై ఆ పార్టీ విజయం ఆధారపడి ఉంటుందని అమరీందర్ సింగ్ అంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement