Thursday, April 18, 2024

Delhi | అప్రూవర్‌గా మారిన‌ శరత్‌చంద్ర రెడ్డి.. సవాల్ చేసే ఆలోచనలో ఆమ్ ఆద్మీ పార్టీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో త్వరలో ఒక కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేషనల్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా దర్యాప్తు సంస్థలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) పావులు కదుపుతున్నాయని.. ఆ క్రమంలోనే కేసులో కీలక నిందితుడిగా ఉన్న అరబిందో గ్రూప్ డైరక్టర్ శరత్‌చంద్ర రెడ్డిని అప్రూవర్‌గా మార్చి కేజ్రీవాల్‌పై ప్రయోగిస్తున్నారని ఆ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో శరత్ అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే న్యాయ నిపుణులతో ఆ పార్టీ ముఖ్యనేతలు చర్చలు జరుపుతున్నారు.

త్వరలోనే రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేసుకు సంబంధించి అనేక కీలక అంశాలను, ప్రత్యేకించి శరత్‌చంద్ర రెడ్డికి సంబంధించి గతంలో దర్యాప్తు సంస్థలు మోపిన అభియోగాలను పిటిషన్‌లో ప్రస్తావించనున్నట్టు తెలిసింది. అప్రూవర్‌గా మారతానంటూ శరత్‌చంద్ర రెడ్డి ముందుకొచ్చిన వెంటనే అంగీకరించిన ఈడీ అధికారులు, ఆ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శరత్ అభ్యర్థనకు  న్యాయస్థానం కూడా ఆమోదం తెలిపింది. అప్రూవర్‌గా మారక ముందే బెయిల్ పొందిన శరత్‌చంద్ర రెడ్డి ప్రస్తుతం బయటే ఉన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement